చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపునకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల యంత్రాంగం వేగవంతం చేసింది. ఈ మేరకు స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లలో భద్రతా ఏర్పాట్లను సోమవారం ఎన్నికల అబ్జర్వర్ శివశంకర్, అభ్యర్థి ఖర్చుల అబ్జర్వర్ సిదానందం, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ పరిశీలించారు. పీవీకేఎన్ కళాశాల కేంద్రంలో ప్రాంగణమంతా పర్యటించారు. ఓట్ల లెక్కింపు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన కౌంటింగ్ హాళ్లు, బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీ టీవీ నిఘా, సాయుధ పోలీసుల మోహరింపు ప్రక్రియలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రిసెప్షన్ సెంటర్ వద్ద సామగ్రి స్వీకరణ, అప్పగింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగేలా..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. ఆయన సోమవారం నగర సరిహద్దులో ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


