చిత్తూరు కలెక్టరేట్ : మున్సిపాలిటీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పకడ్బందీగా మూడంచెల భద్రత కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. సోమవారం పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం, రిసెప్షన్ సెంటర్లను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఆర్డీవో శ్రీనివాసులు నాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. కౌంటింగ్ వేళ బారికేడ్లు పటిష్టంగా ఉండాలని పీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. సీసీ టీవీ నిఘాతో పాటు అనధికార వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ నవీన్, నాగరాజు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


