జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలోని జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రంలోనే భద్రతా వైఫల్యం తలెత్తింది. ముందస్తుగా టీడీపీ కార్యకర్తలు, రౌడీలు నామినేషన్ కేంద్రంలోకి 10 మంది వరకు ప్రవేశించారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు కేంద్రంలోకి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ ఆర్వో రవికుమార్ నాయుడు ఎదుటే వైఎస్సార్ సీపీ పెనుమూరు జెడ్పీటీసీ అభ్యర్థి నిరీషారెడ్డి నామినేషన్ పత్రాలను చించేశారు. అనంతరం లోపల ఉన్న అనధికారిక టీడీపీ గుండాలు ఐదుగురిని ఎన్నికల అధికారులు పోలీసులకు అప్పగించారు. అనంతరం నిరీషారెడ్డితో మరొక సెట్ నామినేషన్లు దాఖలు చేయించారు. జెడ్పీ ఆర్వో కేంద్రం చుట్టూ, ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ రౌడీలు, బయటి ప్రాంతాల కూలీలు కాపుకాశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డగించి భయభ్రాంతులకు గురిచేశారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం జెడ్పీటీసీ అభ్యర్థి కిషోర్ నామినేషన్ పత్రాలను చించేందుకు ప్రయత్నించారు. అభ్యర్థికి తోడుగా వచ్చిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ కారుపై టీడీపీ రౌడీలు దాడికి యత్నించారు. చివరకు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా పోలీసు ఎస్కార్ట్‌తో నామినేషన్లు దాఖలు చేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని మాజీ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. దీంతో ఆయన రక్షణ కల్పించి నామినేషన్లు దాఖలు చేయించారు.


