చిత్తూరు రూరల్ (కాణిపాకం): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని, ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసు బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిత్తూరు నగరంలోని జిల్లా ఏఆర్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయుధ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయుధ కారాగారం, జిమ్, పోలీసు అసోసియేషన్ కార్యాలయం తదితర విభాగాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్లలో భద్రత, సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యాలను ఆయుధ పూజ పునరుద్ఘాటిస్తుందన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ జె.వెంకటనారాయణ, ఏఆర్‌డీఎస్పీలు మహబూబ్ బాష, రామకృష్ణ, పట్టణ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతల తిష్ట
శ్రీరంగరాజపురం: ఎన్నికల నియమావళికి విరుద్దంగా నామినేషన్ కేంద్రంలో 10 మంది టీడీపీ నేతలు తిష్టవేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మురళిపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. నామినేషన్ కేంద్రంలోనే టీడీపీ మండలాధ్యక్షుడు జయశంకర్ నాయుడు, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు.
నామినేషన్ ఫారాలు చింపేశారు
బంగారుపాళెం: మండలంలోని కీరమంద ఎంపీటీసీ సెగ్మెంట్‌కు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ ఫారాలను తెలుగుదేశం పార్టీ మూకలు చంపేశారు. మండలంలోని బండ్లదొడ్డికి చెందిన విశ్రాంత హెఎం గాలేటి సుబ్రమణ్యం కీరమంద(ఎస్టీ) ఎంపీటీసీ సెగ్మెంట్‌కు వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ వేసేందుకు బుధవారం బంగారుపాళెంలోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను అడ్డగించి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. దీంతో సుబ్రమణ్యం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. పోలీసుల ప్రొటెక్షన్‌తో నామినేషన్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సుబ్రమణ్యం తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవకుండా టీడీపీ నాయకులు అధికార బలంతో, దౌర్జనంతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని వాపోయారు.
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. స్థానిక ఏఆర్ పెరేడ్ మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మృతి పరేడ్ చేపట్టారు. ఆర్ముడు రిజర్వు మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ తుషార్ డూడి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేమని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖతో పాటు సమాజం అండగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రామకృష్ణ, ఆర్‌ఐలు సుధాకర్, వీరేశ్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


