వెదురుకుప్పం: జీడీనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్‌పై తిరుగుబాటు మొదలైంది. తమ గ్రామానికి రోడ్డు వేయిస్తానని చెప్పి రెండున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో వెదురుకుప్పం మండలం గంటావారిపల్లె పంచాయతీ ముఠాలం గ్రామ ప్రజలు స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం హాట్‌టాపిక్‌గా మారింది. మండలంలోని గంటావారిపల్లె పంచాయతీ ముఠాలం గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. 128 మంది ఓటర్లు ఉన్నారు. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉంది. గ్రామ రోడ్డు అటవీ ప్రాంతం గుండా వెళుతుంది. 3 కిలోమీటర్లకు పైగా ఉన్న మట్టి రోడ్డు గుంతలమయమైంది. వర్షం వస్తే బురదగుంటను తలపిస్తోందని స్థానికులు అంటున్నారు. దశాబ్దాలుగా రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో సొంతంగా చందాలు వేసుకుని మట్టిని తోలుకుంటున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే రోడ్డును తారు రోడ్డుగా మారుస్తామని థామస్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రోడ్డు గురించి పట్టించుకోలేదని, ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లెక్క కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక నానా అవస్థలు పడుతున్నా ప్రజా ప్రతినిధు లు, అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయదలచుకోలేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమకు న్యాయం జరగనప్పుడు తామెందుకు ఓట్లు వేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి సు మారు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సొంత నిధులతో రోడ్డును బాగు చేసుకుంటున్నామని, ఓట్ల కోసం మా గ్రామానికి ఎవరూ రాకూడదని హెచ్చరించారు.


