చిత్తూరు కలెక్టరేట్ : యువత దేశ భవిష్యత్తుకు కీలకమైన శక్తులని సెట్విన్ సీఈవో యశ్వంత్ తెలిపారు. చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి 15 నుంచి 29 ఏళ్లలోపున్న యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, గీతాలు, పెయింటింగ్, కవితా రచన, నుక్కడ్ నాటక్ (వీధి నాటకాలు) తదితర పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సెట్విన్ సీఈవో యశ్వంత్ మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, కళలు, సామాజిక బాధ్యతల్లో యువత ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. యువత తమ నైపుణ్యాలను సమాజాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేనేజర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన వేదిక కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీల్లో పాల్గొనడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి మాట్లాడుతూ యువత పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో రాణించేలా ఆసక్తి చూపించాలన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారిణి లక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ రబ్బానిబాషా, మైభారత్ సూపర్‌వైజర్ శ్రీనివాసులు, విజయం ఇంజినీరింగ్ కళాశాల ఏవో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


