● అందరూ ప్రశస్త్ యాప్‌ను వినియోగించాలి ● సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సహిత విద్యను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈవోల)కు సహిత విద్యపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. నాలుగు రకాల అలవెన్సుల రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఆటిజం ఉన్న విద్యార్థులకు జిల్లాలో ప్రత్యేకంగా ఐదు ఆటిజం సెంటర్లను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సమగ్ర శిక్ష శాఖ అందిస్తున్న విభిన్న సేవలను అర్హులైన దివ్యాంగ విద్యార్థులందరూ వినియోగించుకునేలా ఎంఈవోలు చొరవ చూపాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 100 శాతం ప్రశస్త్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రస్థాయి పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆరుగురు దివ్యాంగ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వారిని ప్రోత్సహిస్తూ ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డీవైఈవోలు ఉమామహేశ్వర్, ఇందిర, సహిత విద్య కోఆర్డినేటర్ మధు, ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి హేమాద్రి, ఎంఈవోలు పాల్గొన్నారు.


