స్పోర్ట్స్ కోటా బాధితులపై దాడి దారుణం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బాధితులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ప్రభుత్వమే దాడులు చేయించడం దారుణమని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై రౌడీలతో దాడి చేయించడం ప్రభుత్వ ప్లానన్డ్ టెరర్రిజంలో భాగమేనని ఆరోపించారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బెజవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జి చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ న్యాయవాది, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్‌పై తప్పుడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ అనైతిక చర్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు, లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
విద్యార్థి ఆత్మహత్య
పలమనేరు : మండలంలోని ఎగువ కల్లాడు గ్రామానికి చెందిన ఉపేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉపేంద్ర కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గతంలో వీరి కుటుంబం బైరెడ్డిపల్లె మండలంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల బెంగళూరుకు వలస వెళ్లారు. దీంతో ఉపేంద్రను ఎగువ కల్లాడులోని అవ్వ వద్ద ఉంచారు. గురువారం రాత్రి ఏం జరిగిందో కానీ, ఆ బాలుడు గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులకు సమాచారం లేదని తెలిసింది.
బిడ్డకు పాలిస్తుండగా దూసుకొచ్చిన కారు
– భార్యాభర్తలకు తీవ్రమైన గాయాలు
పెద్దపంజాణి: పుంగనూరు మండలం దిగువ కొండమీద పల్లెకు చెందిన మురళి(31) పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరుకు చెందిన మాధురి(27)ని వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెడ్డి మీనాక్షి, రెడ్డి లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు. ఈ నేపథ్యంలో బిడ్డలకు గ్రహ సంబంధం సోకిందని నాటు వైద్యం చేయించుకోవడానికి శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంలో ముత్తుకూరులోని అత్తగారి ఇంటికి వచ్చారు. వైద్య చేయించుకున్న అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గం మధ్యలోని పుంగనూరు– పలమనేరు హైవేపై పెద్దారికుంట బస్టాప్ వద్ద బైక్‌ను రోడ్డు పక్కన ఆపి బిడ్డకు మాధురి పాలిస్తున్నారు. అంతలోనే పుంగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొని ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన మురళి, లావణ్యను స్థానికులు చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల రెఫర్ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.


