పుత్తూరు: రైలులో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) 40 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుత్తూరు ఆర్పీఎఫ్ సీఐ కేపీ సెబాస్టియన్ తెలిపారు. గురువారం వివిధ రైళ్లలో ఎస్‌ఐ విజయ్‌నాయక్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 40 బస్తాల్లోని 1000 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తమిళనాడు రాణిపేట ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి అందజేసినట్లు తెలిపారు.
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధికారి కృష్ణమోహన్ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు నూతన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక పాఠకులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కార్యదర్శి శర్మ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మొత్తం 3,10,910 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. తొలిరోజు మాత్రలు అందుకోలేకపోయిన వారి కోసం అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘మిస్సింగ్ డే’ నిర్వహించి మాత్రలు అందజేస్తామన్నారు. 1–2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర నీటిలో కలిపి, 2–19 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్రను భోజనం తర్వాత చప్పరించి మింగేలా చూడాలన్నారు. అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న లెప్రసీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు.
ముగిసిన జాతీయ సదస్సు
కుప్పంరూరల్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ, ఐఈఈఈ బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు 450 పరిశోధనా పత్రాలు వచ్చినట్లు వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్‌రాజ్ తెలిపారు. సంస్కృతి, సాంకేతిక, వినోద కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. పరిశోధనల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 60 వేల రూపాయలు బహుమతిగా అందజేశామన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిశోధనా సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌బాబు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శ్రీకాళహస్తిరూరల్(తొట్టంబేడు) : తొండమనాడు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం మేరకు.. లక్ష్మణ్ (25) అనే యువకుడు బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వస్తున్నాడు. శేఖర్ అనే వ్యక్తి రాంగ్ రూట్‌లో వస్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వస్థలం విశాఖపట్నం. ఇతను ఏర్పేడు మండలం ఐసర్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడ్డ దారిలో వచ్చి ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


