కిక్కు ఐడియా ఫలించినట్టే ! | - | Sakshi
Sakshi News home page

కిక్కు ఐడియా ఫలించినట్టే !

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

రూ.3 లక్షల ఫీజు.. నాలుగు దరఖాస్తులు తప్పనిసరి

వచ్చేనెల 1వ తేదీ గడువు.. 5వ తేదీన లక్కీడిప్‌

ప్రభుత్వ ఖజానాకు గండి..

నిర్వాహకులకు కిక్కు

సాక్షి, చిత్తూరు: మద్యం దుకాణాల లైసెన్సులను తీసుకోవడంలో ఇప్పటికే ఆరితేరిన కొందరు వ్యక్తుల ఐడియా ఫలించినట్టే. మద్యం దుకాణాల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో టెండర్లు పిలవకుండా.. రెన్యూవల్‌ పేరిట తమ కార్యకర్తలకు ఉపాధి చూపించాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రెన్యూవల్‌ ప్రతిపాదనకు తెరతీసింది. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలోని 18 దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్‌కు వెళ్లకుండా.. వేసిన ప్రణాళిక అమల్లోకి వచ్చేసింది.

రీ–నోటిఫికేషన్‌

జిల్లాలోని 113 మద్యం దుకాణాల్లో, 95 దుకాణాలు రెన్యూవల్స్‌ తీసుకున్నారు. మిగిలిన 18 మంది లైసెన్సీలు రెన్యూవల్‌ చేసుకోలేదు. ఫలితంగా చిత్తూరు కార్పొరేషన్‌లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు జిల్లా ప్రొబేషన్‌ అధికారి శ్రీనివాస్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీచేశారు. అలాగే పెద్ద పంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌండ్లలకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. గురువారం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్‌ 1వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను 3వ తేదీ వరకు పరిశీలించి, 5వ తేదీన చిత్తూరు కలెక్టరేట్‌ కార్యాలయంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు లక్కీడిప్‌ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామన్నారు. రూ.3 లక్షల నాన్‌–రీఫండబుల్‌ దరఖాస్తు రుసుం, అలాగే ప్రతి దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా దాఖలు కావాలనే నిబంధన ఉంచారు. లక్కీడిప్‌లో లైసెన్సులు పొందిన వాళ్లు ఏడాది పాటు దుకాణాలను నిర్వహించుకోవచ్చు.

జిల్లాలో 19 మద్యం దుకాణాలకు రీ–నోటిఫికేషన్‌

అనుకున్నదే..

మద్యం దుకాణాలను రెన్యూవల్‌ చేసుకుంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించాలి. అదే లక్కీడిప్‌కు వెళితే నాలుగు దరఖాస్తులు దాఖలు చేసినా, రూ.12 లక్షల వ్యయం మాత్రమే అవుతుంది. ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు దరఖాస్తు చేయకుండా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రూపొందించిన ప్రణాళికపై మూడు రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమయ్యింది. ప్రభుత్వం కనీసం పది దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్‌ తీస్తామనే నిబంధన ఉంచినట్లయితే.. ఖాజాను గండిపడేదికాదు. కానీ ఇపుడు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. పచ్చ కార్యకర్తల జేబులు నింపేలా తయారయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement