ఆగని తుమ్మింద గ్రానైట్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

ఆగని తుమ్మింద గ్రానైట్‌ దందా!

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

దౌర్జన్యంగా క్వారీని ఆక్రమించిన ప్రజాప్రతినిధి బంధువు వందల కోట్ల విలువైన నల్లబంగారం దోపిడీ అధిష్టానానికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో గ్రానైట్‌ అక్రమ తవ్వకాల దందా హద్దు మీరుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన బంధువుల అండ చూసుకుని గ్రానైట్‌ మాఫియా రెచ్చిపోతోంది. రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోపిడీ చేస్తోంది. క్వారీ నిర్వాహకుల నుంచి రూ.కోట్లు మామూళ్లు డిమాండ్‌ చేయడం, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు దిగి క్వారీలనే హస్తగతం చేసుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తుమ్మింద ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్‌ ఎంతో నాణ్యమైనది. దీనికి మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. రూ.కోట్లు విలువ చేసే నల్ల బంగారం కావడంతో దీనిపై ప్రజాప్రతినిధి బంధువు కన్ను పడింది. క్వారీ నిర్వాహకుడిని పిలిపించి రూ.3 కోట్లు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేనని సదరు నిర్వాహకుడు చేతులెత్తేయడంతో బెదిరింపుల పర్వం మొదలైంది.

దౌర్జన్యంగా క్వారీ స్వాధీనం..?

మామూళ్లు రాకపోవడంతో కక్ష పెంచుకున్న ఆ ప్రజాప్రతినిధి బంధువు దౌర్జన్యానికి దిగాడు. క్వారీ నిర్వాహకుడిని బెదిరించి పక్కకు నెట్టేసి, క్వారీ నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నాడు. యంత్రాలు పెట్టి రాత్రింబవళ్లు చట్టవిరుద్ధంగా గ్రానైట్‌ రాళ్లను తోడేస్తున్నాడు.

కొన్నాళ్లు బంద్‌.. మళ్లీ షురూ

సదరు ప్రజా ప్రతినిధి బంధువు వేధింపులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బాధితుడు గతంలో ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధి బంధువు చేస్తున్న అక్రమాల చిట్టాను వారి ముందుంచాడని సమాచారం. ఈ విషయం తెలిసి ఆ బంధువు కొన్నాళ్ల క్రితం ఆ అక్రమ క్వారీని బంద్‌ చేయించాడు. అధికారుల తనిఖీలు సడలడం, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో గడిచిన నెలరోజులుగా మళ్లీ అక్కడ అక్రమ క్వారీ దందా ముమ్మరంగా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో నల్ల బంగారాన్ని సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ వ్యవహారం మళ్లీ జిల్లా కలెక్టర్‌ చెవిలో పడడంతో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

రూ.3 కోట్లు ఇవ్వాలని క్వారీ నిర్వాహకుడికి బెదిరింపులు

కూటమి నేతల భగ్గు..

ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు, అనుచరుల హద్దుమీరిన అక్రమాలు, దౌర్జన్యాలపై సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం తెచ్చిన మంచి పేరును ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు తమ స్వార్థం కోసం నాశనం చేస్తున్నారని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను బెదిరించి, క్వారీ నిర్వాహకులను లొంగదీసుకుంటూ సాగిస్తున్న ఈ మాఫియా రాజ్యాంగంపై కూటమిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందాలపై పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో పంపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement