చిత్తూరు కార్పొరేషన్: ఒక యువకుడు ఫోన్ మాట్లాడుతూ రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. రైల్వే ఎస్‌ఐ నరసింహులు కథనం మేరకు.. స్థానిక బండపల్లెలో జరిగిన చావుకు డప్పు కొట్టడానికి జీడీనెల్లూరు మండలం ఎస్‌ఎస్ కొండ గ్రామానికి చెందిన మంజునాథ(22) బృందంతో పాటు వచ్చాడు. సమీపంలోని అంగడికి వెళ్లి వస్తువులు కొనుక్కొని తిరిగి వచ్చే సమయంలో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అటువైపు వస్తున్న తిరుచిరాపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం పవిత్ర ప్రతిష్ట, శుక్రవారం పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి చేపడతారు. భక్తులు ఒక్కొక్కరు రూ.750లు చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేయనున్నట్లు తెలిపారు.


