● పవిత్రం.. పునీతం | - | Sakshi
Sakshi News home page

● పవిత్రం.. పునీతం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ● చక్రస్నానం ఘట్టానికి తరలివచ్చిన అశేష భక్తజనులు ● ధ్వజావరోహణంతో పరిపూర్ణమైన మహోత్సవాలు

శ్రీవారి పుష్కరిణికి పోటెత్తిన భక్తులు (ఇన్‌సెట్‌) చక్రస్నానం నిర్వహిస్తున్న వేద పండితులు

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.. విశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. ఈ క్రమంలోనే వేకువజామున శ్రీవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు.అభిషేకానంతరం పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి దివ్యప్రబంధ పాశురాలను పఠించారు. అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఏమి మా భాగ్యము.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ భువి వైకుంఠంలో అడుగిడిన మా జీవితము ధన్యము.. చక్రత్తాళ్వార్‌ను స్పృశించిన పవిత్రజలములో స్నానమాచరించిన మాదే కదా పుణ్యము.. ఉభయ దేవేరీ సమేతంగా కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారి తిరుమంజన సేవ వీక్షణంతో తరించెను మా జన్మము.. అంటూ భక్తజనులు పరవశించారు. వైకుంఠనాథుని వైభవోత్సవంలో పాలుపంచుకుని పులకించారు. ఆనందనిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుని దివ్యతేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement