మూడోసారి వాయిదా పడిన ద్రవిడ వర్సిటీ స్నాతకోత్సవం ఏర్పాట్లకు వెచ్చించిన రూ.లక్షలు వృథా గందరగోళంలో పట్టభధ్రులు త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం : రిజిస్ట్రార్
కుప్పం : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఏర్పాటై సుమారు 30 ఏళ్లు గడుస్తోంది. అయితే ఏటా స్నాతకోత్సవం నిర్వహించేందుకు వర్సిటీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 పర్యాయాలు మాత్రమే స్నాతకోత్సవం నిర్వహించారు. 2007లో మొదటిసారి, 2015లో రెండో సారి కాన్వొకేషన్ డే జరిపించారు. తర్వాత ఇప్పటి వరకు స్నాతకోత్సవం నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రతిసారి స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేయడం చివరకు వాయిదా వేయడం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య ఎల్‌సి మల్లయ్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని ప్రచారం చేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికలు సైతం ముద్రించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, స్నాతకోత్సవం వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
సర్వం సిద్ధమైనా..
వర్సిటీ కాన్వొకేషన్ డేకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆహ్వాన పత్రికలు పంచేశారు. అడ్మి ట్ కార్డులు, స్నాతకోత్సవ సర్టిఫికెట్లు, పతకాలు, గౌరవ డాక్టరేట్లు సిద్ధం చేశారు. మరో మూడు రోజుల్లో కాన్వొకేషన్ డే ఉందనగా మళ్లీ వాయిదా వేసేశారు. దీంతో ఏర్పాట్లకు అయిన ఖర్చు వృథాగా మారింది. 2022లో ఒకసారి ఇలాగే ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదా పడింది. అనంతరం ఇన్‌చార్జి వీసీగా దొరస్వామి ఉన్నప్పుడు సైతం వాయిదా వేశారు.
అయోమయంలో అభ్యర్థులు
ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఒకేసారి 3 నుంచి 15 స్నాతకోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో 700 మంది అభ్యర్థులకు పట్టాలు అందించాల్సి ఉంది. ఇందులో 350మందికి పైగా డాక్టరేట్లు అందుకోవాల్సి ఉంటుంది. దేశ నలుమూలల నుంచి అభ్యర్థులు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రిజర్వేషన్లు సైతం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. మళ్లీ స్నాతకోత్సవం వాయిదా పడడంతో అయోమయానికి గురవుతున్నారు.
ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
పాలనాపరమైన కారణాలతోనే..
ద్రవిడ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయి తే పాలనా పరమైన కారణాలతో వేడుకలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే నూతన తేదీని ప్రకటిస్తాం. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.
– కిరణ్ కుమార్, రిజ్రిస్టార్


