పెద్దశేష వాహనంపై విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు
కలియుగ వైకుంఠనాథుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలకగా.. మంగళవారం మీన లగ్నంలో నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకున్నారు.
పెద్ద శేష వాహనంపై
అభయముద్ర
బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు.


