ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద
తూకాల్లో గోల్‌మాల్!
తూకం వేయకుండానే రేషన్ షాపులకు బియ్యం సరఫరా
లారీ నుంచి లారీకి మార్చేసి దందా
బస్తాకు 2 నుంచి 3 కిలోలు కోత
ప్రశ్నిస్తే ‘మామూళ్లు ఎవరు ఇస్తారు?’
అని దబాయింపు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్రమాలకు అడ్డాగా స్టాక్ పాయింట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్‌పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
తూకం లేదు .. కొలత లేదు
స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్‌న్‌లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్‌పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాలను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్ర తి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలపైనే తరుగు భారం!
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్‌పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు
మామూళ్లు ఎవరిస్తారంటూ దబాయింపు
ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.


