మరో వారంలో ఓటర్ల జాబితా
సాక్షి, చిత్తూరు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన జిల్లాలోని నగరపాలక సంస్థతోపాటు రెండు మున్సిపాలిటీల్లో వార్డుల వారీ గా ఓటర్ల జాబితా ప్రచురించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్, మేయ ర్ స్థానాల ఖరారు చేసి.. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయడమే మిగిలింది.
వార్డుల వారీగా వివరాలు
జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మునిసిపాలిటీలు ఉన్నాయి. కుప్పం పాలకవర్గానికి నవంబరు వరకు గడువు ఉంది. మిగిలిన చోట్ల పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు వీడడంతో అధికారులు రెండు రోజుల క్రితం కొత్త వార్డుల సరిహద్దులు నిర్ణయిస్తూ వివరాలను గెజిట్ రూపంలో విడుదల చేశారు. దీంతో చిత్తూరు కార్పొరేషన్‌లోని 50 డివిజన్లు 60గా మారాయి. నగరిలోని 29 వార్డులను 40గా, పలమనేరులో ఉన్న 26 వార్డులను 36గా పెంచుతూ అధికారులు గెజిట్ విడుదల చేశారు. కానీ, కుప్పంలోని 25 వార్డులను 32 స్థానాలకు పెంచినప్పటికీ తొలి షెడ్యుల్‌లో ఇక్కడ ఓటర్ల జాబితా ప్రచురణ ఉండదు. రెండో దశలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
ఇక మిగిలింది రిజర్వేషన్లే
వార్డుల పునర్వభజన పూర్తవడం, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయితే మరో షెడ్యుల్ విడుదలవుతుంది. ప్రచురించిన ఓటర్ల జాబితాలో మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి మున్సిపల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. అనంతరం వార్డులను ఏయే సామాజిక వర్గాలకు కేటాయించాలనే నిబంధన ప్రకారం కలెక్టర్ రిజర్వేషన్లు ప్రకటిస్తారు. తుదిగా మేయర్, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం, తర్వాత ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తారు.
అభ్యర్థుల కోసం వేట
చైర్మన్, మేయర్ స్థానాల రిజర్వేషన్ ప్రకటన వెలువడకముందే జిల్లాలో అభ్యర్థుల కోసం పార్టీల వేట మొదలైంది. తొలిగా ఓపెన్ కేటగిరీ వస్తే ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై కసరత్తు ప్రారంభమైంది. రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఆర్థిక బలవంతుల కోసం టీడీపీ జల్లెడ పడుతోంది. చిత్తూరులో మేయర్ స్థానం ఆశిస్తునన వారు ఇప్పటికే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. మేయ ర్ కుర్చీ కోసం రూ.20 కోట్లు సైతం ఖర్చు చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నారు. కానీ, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో ప్రతిపక్షానికి ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేయలేకపోతున్నారు.
వార్డుల పునర్విభజన పూర్తవడంతో తాజాగా ఓటర్ల జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 22వ తేదీ చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, మున్సిపాలిటీల్లోని 136 వార్డుల్లో ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వార్డుల వారీగా పురుష, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించనున్నారు. తర్వాత వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల జాబితా, ఒక్కో వార్డులోని ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా సర్దుబాటు చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.


