– తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి
నగరి : వినాయక చవితి వేడుకల్లో ఆనందంగా సాగాల్సిన ఊరేగింపు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వినాయక ప్రతిమను ట్రాక్టర్‌లో ఊరేగిస్తుండగా జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరి మండలం దామరపాకం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దామరపాకం గ్రామానికి చెందిన జి. శంకర్ కుమార్తె ప్రసన్నశ్రీ (11) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి గ్రామంలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగిస్తున్నారు. ఈ సమయంలో తండ్రి చిన్నారిని ట్రాక్టర్‌లో జనరేటర్ పక్కన కూర్చో బెట్టాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జనరేటర్ ఫ్యాన్‌న్‌కు చిన్నారి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడింది. తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.


