కుప్పంరూరల్ : కుప్పంలోని పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణలో తమిళనాడుకు చెందిన సోమసుందరం అనే వృద్ధుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. తమిళనాడు నుంచి వచ్చిన సోమ సుందరం పగటి పూట పట్టణంలో భిక్షాటన చేసు కుని రాత్రివేళ పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణ లో నిద్రించేవాడు. కాగా సోమవారం రాత్రి పడుకున్న వృద్ధుడు నిద్రలోనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అయితే సోమసుందరం తన కుటుంబీకుల ఫోన్ నంబర్లు, చిరునామా ఓ పేపర్‌పై రాసుకుని ఉన్నాడు. దీంతో వృద్ధుడు మృది చెందిన వార్తను ఆయన కుటుంబీకులకు పోలీసులు తెలియజేశారు.
బాణసంచా పేలి
ఐదుగురికి గాయాలు
బంగారుపాళెం: మండలంలోని కూర్మాయిపల్లె పంచాయతీ రోళ్లవారిపల్లెలో గణపతి విగ్రహ నిమజ్జనంలో సోమవారం సాయంత్రం అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు కారణంగా ఐదురుగు గాయపడ్డారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వినాయ క చవితిని పురష్కరించుకుని సోమవారం ఉదయం రోళ్లవారిపల్లెవాసులు గణపతి ప్రతిమకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం నిమజ్జన ఊరేగింపు నిమిత్తం బాణసంచా తెప్పించారు. అందులో కొంత ఓ ఇంటి ఆవరణలో ఉంచారు. ఊరేగింపు మొదలైన తర్వాత బాణసంచా పేలుస్తుండగా రవ్వలు ఎగసి ఇంటి ఆవరణలో పెట్టిన టపాకాయలపై పడ్డాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. అక్కడే ఉన్న జగదీశ్వర్‌రెడ్డి, సుగుణ్ సింధుప్రసాద్, జయచంద్రారెడ్డి, కిషోర్‌రెడ్డి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రిఇక తరలించారు. జగదీశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
వ్యక్తిపై కత్తితో దాడి
కుప్పంరూరల్: పురపాలక పరిధిలోని అనిమిగానిపల్లెలో వెంకటేష్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేష్ ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసి కత్తితో పొడిచాడు. వెంకటేష్ కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంకటేష్ ను పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలతో వెంకటేష్‌పై దాడి జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో
యువతి మృతి
పూతలపట్టు(యాదమరి): మండలంలోని వసంతాపురం దళితవాడలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవిశంకర్ కుమార్తె సబిత (23) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తోంది. మంగళవారం ఉదయం నీటి కోసం మోటారు వేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే పి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంతలో
కర్ణాటక యువకుడు గల్లంతు
శాంతిపురం : మండలంలోని 64 పెద్దూరు పంచాయతీ కారిముట్ల గ్రామం వద్ద రాతి క్వారీ గుంతలో కర్ణాటకకు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు.. కె గొల్లపల్లెకు చెందిన మనోహర్‌కు కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తున్న తుముకూరుకు ముబారక్(24) తో స్నేహం ఉంది. సోమవారంహోటల్‌కు సెలవు రావడంతో మిత్రుడి ఆహ్వానం మేరకు ముబారక్ వచ్చాడు. ఉక్కపోతగా ఉండడంతో సాయంత్రం మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు కారిముట్ల వద్ద ఉన్న క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇంతలో ముబారక్ నీట మునిగిపోయా డు. మిగిలిన ముగ్గురు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టినా మృతదేహం లభించలేదు. అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.


