పలమనేరు: పట్టణ సమీపంలోని కౌండిన్య నది లో ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం వద్ద అక్రమంగా ఇసుకను తోడుతున్న జేసీబీ, ట్రాక్టర్‌ను ఆదివారం పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. జీడిమాకులపల్లికి చెందిన ఇద్దరు ఇసుకాసురులపై కేసు నమోదు చేశారు. ఇక్కడి కౌండిన్య నదిలో కొందరు యథేచ్ఛగా ఇసుకను జేసీబీలతో తవ్వి తరలిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నదికి ఆనుకుని ఉన్న రైతులు పలుమార్లు అధికారులకు తెలిపినా స్పందన లేకుండా పోయింది. ఇలా ఉండగా కొందరు ఆదివారం నేరుగా పోలీసులను తీసుకెళ్లి వారి కళ్లముందే ఇసుకాసరులను పట్టించినట్టు తెలిసింది. జేసీబీ, ట్రాక్టర్ మంజునాథ్, సురేంద్రకు చెందినవిగా తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారా లేదా వాహనాల డ్రైవర్లపై కేసులు పెట్టారా అనే విషయం తెలియరాలేదు.


