బ్రహ్మాండం! | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండం!

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

● నేటి నుంచి కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ● శోభాయమానంగా ముస్తాబైన క్షేత్రం ● ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు ● సీసీ కెమెరాలు, డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా ● రంగంలోకి పోలీసు యంత్రాంగం

బ్రహ్మోత్సవం..
ప్రత్యేక పూజలు, వాహన సేవలు

కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల శోభ మొదలైంది. సోమవారం చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబర్‌ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంతోపాటు పరిసరాలను శోభాయమా నంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుంచి నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామి వారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విఘ్నేశ్వరుడు వివిధ వాహనాలపై కాణిపాక వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఈవో పెంచల కిషోర్‌ పర్యవేక్షణలో అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల పొడవును పెంచడంతో పాటు అదనపు షెడ్లను ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాల కోసం ఇబ్బంది పడకుండా ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కూడా క్యూలైన్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రథంతో పాటు వివిధ సేవలకు వినియోగించే వాహనాలకు రంగులు వేసి కొత్త కళను తీసుకువచ్చారు. చిత్తూరు, తిరుపతి మార్గాల నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలుకుతూ భారీ డిజిటల్‌ కటౌట్లు, తోరణాలు అమర్చారు. ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్‌ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూషిక, అన్వేటి, సుపథ మండపాలతో పాటు నవగ్రహ, అభయాంజనేయస్వామి ఆలయాల వద్ద విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖద్వారం నుంచి ధ్వజస్తంభం, అంతరాలయం వరకు వివిధ రకాల దేశీయ, విదేశీ పూలతో అలంకరించారు. హోమాలు, జపాలు, యజ్ఞ పూజల కోసం ప్రత్యేకంగా యజ్ఞశాలను సిద్ధం చేశారు.

మూడు చోట్ల పార్కింగ్‌ స్థలం

భక్తుల వాహనాల రద్దీని నివారించేందుకు ముందుగానే పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. గణేష్‌ సేవాసదన్‌ భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, భారీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించగా, కాణిపాకం బస్టాండును ఆను కుని ఉన్న ప్రాంగణంలో కార్లు, ఆటోలు నిలి పేలా చర్యలు చేపట్టారు. అలాగే ఈవో నివాస భవనం వెనుక భాగంలో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

పూలతో అలంకరణలు చేస్తున్న సిబ్బంది

విద్యుత్‌ దీపాల వెలుగులో కాణిపాకం ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement