కుప్పంలో కిలో కనకాంబరం రూ.600 నుంచి రూ.900 తగ్గిన దిగుబడితో పూలకు డిమాండ్ వినాయక చవితి పండుగకు మరింత పెరిగిన ధరలు
కుప్పం రూరల్ : కుప్పం మార్కెట్‌లో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజులుగా సరాసరిన రూ.500 పలికిన కనకాంబరం పూలు ఆదివారం కిలో రూ.600 నుంచి రూ.900 పలికాయి. మిగిలిన పూల ధరలు వందల్లో పెరిగింది. దిగుబడి తగ్గడం, వినాయక చవితి పండుగ కావడంతో పూల ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. ఒకప్పుడు కుప్పం నుంచి దేశ విదేశాలకు పూలు ఎగుమతి అయ్యేవి. నేడు కుప్పం నుంచి బెంగళూరు, చైన్నె, ముంబయి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కుప్పం ప్రాంతంలో 20 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్న బావుల వద్ద కొంత మంది రైతులు తక్కువ విస్తీర్ణంలో పూల తోటలు సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. కుప్పం పూల మార్కెట్‌లో ఆదివారం కిలో పూల ధరలు ఇలా ఉన్నాయి. కనకాంబరం కిలో రూ.600 – 900, మల్లెలు కిలో రూ.1000, కాగడాలు రూ.500, జాజిమల్లె రూ.900, నేల సంపంగి రూ.350, సెంటుజాజులు రూ.900, గన్నేరు రూ.260, చామంతి రూ.250, గులాబి రూ.250, బంతి రూ.50 పలుకుతున్నాయి. పూలను కొనేందుకు ఆదివారం మార్కెట్‌లో జనం ఎగబడడం కనిపించింది. ఉద యం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కె ట్ సాగడం గమనార్హం.


