చిత్తూరు కలెక్టరేట్ : డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడం, ఉన్నత విద్యను అభ్యసించేలా అల్పాదాయ కుటుంబాల్లోని పిల్లలను ప్రోత్సహించడం, ఆర్థిక కారణాలతో చదువు ఆగిపోకుండా చూడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి ప్రతిభా పోటీల్లో సత్తా చాటితే నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్ అందుతుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో ఓసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికై న విద్యార్థులకు 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమచేస్తారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో పరీక్ష రాయవచ్చు. రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 90, స్టాటిస్టిక్ ఆప్టిట్యూట్ 90 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అక్టోబర్ 12 చివరి తేదీ. పరీక్ష రుసుం చెల్లించేందుకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంది. పరీక్ష నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు www. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో లక్ష్మినారాయణ సూచించారు.


