ఫ్రీ హోల్డ్ పేరుతో సర్కారు కుట్రలు రైతులకు సమస్యలు .. తమ్ముళ్లకు సమర్పణ రీ వెరిఫికేషన్ పేరిట మరో నాటకాలు జాబితాలో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు
పేదల ఆశలపై నీళ్లు
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో చేస్తున్న కుట్రలు వివాదాలకు దారితీస్తున్నాయి. దశాబ్దాల తరబడి భూము లను నమ్ముకున్న పేద రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే, కూటమి సర్కారు ఆ లబ్ధిని లాగేసుకుంటోంది. రైతులకు గతంలో అందించిన ఫ్రీ హోల్డ్ (పూర్తి యాజమాన్య) హక్కులను ప్రస్తుత సర్కారు కుట్రపూరితంగా లాక్కోవడంపై గ్రామీణ ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతోంది. రీ వెరిఫికేషన్, సమీక్షల పేరుతో లక్షలాది ఎకరాలను తిరిగి 22 ఏ నిషేదిత భూముల జాబితాలోకి నెట్టివేయడంపై రైతాంగం మండిపడుతోంది.
కుప్పంలో సైతం..
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం ప్రభుత్వం పక్షపాత వైఖరికి పాల్పడి దగా చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. కుప్పం, వి.కోట మండలాల్లో ఉద్దేశపూర్వకంగాానే భూ హక్కులపై కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుప్పం మండలంలో సుమారు 8,674 ఎకరాలను గత వైఎస్సార్‌సీపీ సర్కారు ఫ్రీ హోల్డ్‌గా ప్రకటిస్తే, అందులో ఏకంగా 8,400 ఎకరాల భూ హక్కులను రద్దు చేసి 22 ఏలో పెట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వి.కోట మండలంలో 12,226 ఎకరాల డీకేటీ భూములను గతంలో ఫ్రీహోల్డ్ గా ప్రకటిస్తే, ప్రస్తుతం ఏకంగా 9,243 ఎకరాలను చంద్రబాబు సర్కారు రద్దు చేస్తోంది.
ఆందోళనలో రైతులు
రీ వెరిఫికేషన్ అనేది కేవలం ఒక నాటకమని, వైఎస్సార్‌సీపీ సర్కారు పేదలకు చేసిన మంచిని చెరిపేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా సమాచారం
ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూములు
1.59 లక్షల ఎకరాలు
ప్రభుత్వం అక్రమంగా కోత పెట్టినవి
1.05 లక్షల ఎకరాలు
ప్రస్తుతం హక్కు కల్పిస్తున్నవి
53,917 ఎకరాలు
నష్టపోతున్న రైతులు 30,150 మంది
ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో పారదర్శకత పాటిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తాం. రీ వెరిఫికేషన్ చేయించి అర్హులందరికీ న్యాయం చేస్తాం.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కింది. వాస్తవంలోకి వచ్చేసరికి నిజమైన రైతుల భూములను 22 ఏ కింద నిషేధ జాబితాలోకి చేర్చేసింది. తమ్ముళ్లకు చెందిన సాగులేని భూములకు మాత్రం యథేచ్ఛగా సర్వ హక్కులు కట్టబెడుతోంది. గత వైఎస్సార్‌సీపీ సర్కారులో నిష్పక్షపాతంగా తయారు చేసిన జాబితాలను బుట్టదాఖలు చేసి.. టీడీపీ నేతలకే పెద్దపీట వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
గత వైఎస్సార్‌సీపీ సర్కారు అసైన్డ్ భూములకు సంబంధించి 20 ఏళ్ల పాటు అనుభవంలో ఉన్న పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ విధానం తెచ్చింది. దీంతో రైతుల తమ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాగానే రీ వెరిఫికేషన్ పేరుతో ఈ ప్రక్రియను నిలిపివేసింది. వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ కల్పించారు. ప్రస్తుతం కూటమి సర్కారు రీ వెరిఫికేషన్ పేరుతో 1.05 లక్షల ఎకరాలకు తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 53,917 ఎకరాలకు మాత్రం ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో విచిత్రమేమిటంటే...సాధారణ, పేద రైతుల భూములను రిజిస్ట్రేషన్‌లు కాకుండా 22 ఏలో పెడుతూ, పచ్చ నేతలకు మాత్రం సైలెంట్ గా ఫ్రీ హోల్డ్ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్‌లు చేయించేలా కుట్ర చేస్తున్నారు. పక్షపాతంతో రెవెన్యూ రికార్డుల్లో యథేచ్చగా మార్పులు, చేర్పులు చేస్తూ నిజమైన లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారు.


