జగనన్న కాలనీలపై సర్కారు శీతకన్ను కనీస వసతులు కరువు సకాలంలో బిల్లులు రాక పునాదులకే పరిమితం
పునాదులు, మెండి గోడలకే
పరిమితమైన కాలనీ
అధ్వానంగా దాసేగానూరు వద్ద
జగనన్న కాలనీ
నిరుపేదల సొంతింటి కల అసంపూర్తిగా మిగిలిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన కాలనీలను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేసేస్తోంది. కనీస వసతులు సైతం కల్పించకుండా కావాలని కాలయాపన చేస్తోంది. సకాలంలో బిల్లులు చెల్లించకుండా నిర్మాణ పనులను నిలిపివేసుకునే దుస్థితిని తీసుకువస్తోంది. కనికరించాలని లబ్ధిదారులు నేతలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందించకుండా పేద బతుకులను ఇబ్బందిపెడుతోంది.
కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 102 కాలనీల నిర్మాణం చేపట్టింది. వీటిలో 15 వేల పైచిలుకు ఇళ్లు మంజూరు చేసింది. అనంతరం మారిన రాజకీయాల పరిమాణాల దృష్ట్యా జగనన్న కాలనీలకు చంద్ర గ్రహణం పట్టింది. రెండేళ్లుగా కాలనీలోని గృహాలకు సకాలంలో బిల్లు రాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో కాలనీల్లో ఎటు చూసినా పునాదులు, మొండి గోడలే కనిపిస్తున్నాయి. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు ఏం చేయాలో దిక్కతోక మిన్నకుండి పోయారు.
ఒక్క ఇల్లు మంజూరు కాలేదు
రెండేళ్ల కూటమిపాలనలో సీఎం చంద్రబాబు ప్రాతి నిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు మంజూరు కాలేదు. కేవలం పురపాలక పరిధిలో అర్బన్ ఏరియా కింద కుప్పం పట్టణానికి కొన్ని గృహాలు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని నాలు గు మండలాల్లో గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు మంజూరు చేయకపోవడం గమనార్హం.
పిచ్చిమొక్కలతో నిండిన కాలనీ
రహదారి దుస్థితి
అర్ధాంతరంగా ఆగిన కాలనీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిపోయాయి. వర్షాలకు రోడ్డు , వీధులు కోతకు గురై నడవలేని పరిస్థితి ఏర్పడింది. కాలనీ గృహాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ వగరప్ప కోటాలు వద్ద 120 ఇళ్లతో కాలనీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ కాలనీ అధ్వానంగా మారింది. పునాదులు, మెండి గోడలకే పరిమితమైయింది. చిట్టడవిని తలపిస్తోంది.


