గంగవరం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉంచడమే కాకుండా ఆరోగ్య కార్యక్రమాలు, ఆన్‌లైన్ అప్‌డేట్లను వంద శాతం నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం గంగవరం మండలంలోని పత్తికొండ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పీహెచ్‌సీ రికార్డులు పరిశీలించి సేవల నాణ్యత, మందుల గది, ల్యాబ్ గదిని తనిఖీ చేశారు. అనంతరం వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి సంబంధించిన అన్ని రికార్డులు, మాతా శిశు సంరక్షణ సేవలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే సంజీవని కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య కార్యక్రమాల పురోగతి నిరంతరం పర్యవేక్షించి సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో వందశాతం అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వైద్యాధికారి మల్లికార్జున్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


