పసికందుకు పక్కాగా చికిత్స | - | Sakshi
Sakshi News home page

పసికందుకు పక్కాగా చికిత్స

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

● జిల్లా ఆస్పత్రి ప్రసూతి విభాగం వెనుక మగబిడ్డను వదిలేసిన వైనం ● సీసీ పుటేజీలో బ్యాగుతో వచ్చిన వృద్ధుడి దృశ్యాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : అప్పుడే పుట్టిన పసికందును కటిక నేలపై వదిలేసిన అమానుష ఘటన చిత్తూరు నగరంలో చర్చనీయాంశమైంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం వెనుక భాగంలో బుధవారం ఉదయం ఓ నవజాత మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ చిన్నారిని ఎస్‌ఏఐసీయూ వార్డుకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఆ బిడ్డను మాకిచ్చేయండి ప్లీజ్‌...

పసిబిడ్డను చూసి ఆస్పత్రిలోని మహిళా సిబ్బంది మనసు చలించిపోయింది. ఆ బిడ్డను మాకిచ్చేయండి, మేము ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాం అంటూ చాలా మంది అధికారులను వేడుకుంటున్నారు. అయితే చిన్నారి రక్షణ, చట్టబద్ధమైన దత్తత నిబంధనల దృష్ట్యా ఎవరికీ నేరుగా ఇచ్చేందుకు వీలులేదని, బిడ్డ కోలుకున్నాక చట్టప్రకారం శిశువిహార్‌కు అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

వదిలేసింది ఎవరు?

కన్నబిడ్డను అలా వదిలేసి వెళ్లిన నిర్దయులు ఎవరనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బుధవారం ఉదయం సరిగ్గా 6.10 గంటల ప్రాంతంలో ఓ వృద్ధుడు ప్రసూతి విభాగం వెనుక గేటు గుండా లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. చేతిలోని బ్యాగులో బిడ్డను తీసుకొచ్చి, ఎవరూ చూడని సమయం చూసి అక్కడ పెట్టేసి జారుకున్నట్లు దృశ్యాల ద్వారా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఆ వృద్ధుడు గేటు వద్దకు ఎలా వచ్చాడు? అక్కడ నుంచి ఏ వాహనంలో పరారయ్యాడు? ఆటోలో వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఎస్పీ సీరియస్‌

బిడ్డను వదిలి వెళ్లిన విషయం తెలుసుకున్న ఎస్పీ అత్యంత తీవ్రంగా ఈ కేసును పరిగణించారు. కానీ, ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు... కేసు నమోదు కాకపోవడంతో అమ్మను కనిపెట్టడంలో కొందరు పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement