పుత్తూరు: ఖోఖో ఆడడానికి వెళ్లిన విద్యార్థులు గ్రౌండ్‌లోని రాళ్ల ను ఏరివేయాల్సి వచ్చింది. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూస్తామని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ఉషా రాణి పుత్తూరు విద్యాశాఖాధికారికి లిఖిత పూర్వకంగా లేఖ రాసి ఇచ్చారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో నారా యణ ఏమిటయ్యా ఇది? అంటూ విద్యార్థుల చేత మట్టి పనులు చేయించడంపై కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంఈఓలు తిరుమలరాజు, బాలసుబ్రమణ్యం వెంటనే నారాయణ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ప్లేగ్రౌండ్ బాగు చేసే పని మీది కాదని, అలాంటి పనులు చేయకూడదని అవగాహన కల్పించారు. అనంతరం ఆటస్థలం పరిశీలించారు. పాఠశాల నిర్వాహకులను వివరణ కోరారు. మరోసారి ఇలాంటి పొరబాటు జరగదని ప్రిన్సిపల్ లెటర్ రాసి ఇచ్చారు.
చెరువులో నీటి చౌర్యం
పలమనేరు : అసలే కరువు కారణంగా వర్షాలు కురవక చెరువుల్లోని నీటిని వృథా చేయకుండా చూసుకోవాల్సిందిపోయి చెరువుకే మోటార్ పెట్టి లాగేస్తున్న ఘటన మండలంలోని నక్కపల్లెలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ సమీపంలోని చెరువులో నీరు పుష్కలంగా ఉంది. ఈ నీటిని రైతులు పొదుపుగా పంటలకు వాడుకుంటున్నారు. కానీ, చెరువు పక్కనే భూమి కలిగిన నాగరాజు అనే వ్యక్తి తాను టీడీపీ నేతనంటూ పెత్తనం చెలాయిస్తున్నాడు. ఏకంగా చెరువునీటిని మోటార్ ద్వారా లాగేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, వీఆర్‌ఓ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మాజీ సర్పంచ్ విశ్వనాథ రెడ్డి తెలిపారు.


