కని విసిరేస్తున్నారు..! | - | Sakshi
Sakshi News home page

కని విసిరేస్తున్నారు..!

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● పురిటిలోనే కన్నపేగును తెంచుకుంటున్న కఠినాత్ములు ● చెట్ల పొదలు, రోడ్లు, ఆస్పత్రి బాత్‌రూమ్‌లలో పసికందులు ● తాజాగా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి విభాగం వెనుక మగబిడ్డ లభ్యం ● టీనేజ్‌ గర్భాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న నిపుణులు ● ఆపదలో ఉంటే ఊయలలో వేయాలంటున్న అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అభం శుభం ఎరుగని పసిపాపలు అనాథలుగా మారుతున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లులే పేగుబంధాన్ని తెంచుకుంటున్నారు. లోకాన్ని చూడకముందే నవజాత శిశువులను చెట్ల పొదల్లో, ముళ్ల కంచెల్లో, రోడ్ల పక్కన వదిలేసి వెళ్తున్నారు. కొంతమంది ఆస్పత్రులు, ఆలయాల వద్ద నిర్దయతో వదిలిపెడుతున్నారు. చివరికి ఆ పసికందులు శిశువిహార్‌ వంటి సంరక్షణ కేంద్రాల ఆలనాపాలనాలో పెరుగుతున్నారు.

పెరిగిపోతున్న దారుణాలు.. కారణాలివే

పసికందులను ఇలా వదిలేయడానికి అనేక సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. చాలామంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తాళలేక కన్నబిడ్డలను వద్దనుకుంటున్నారు. మరికొందరు సంతానం లేని వారికి ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇటీవల కాలంలో టీనేజీ వయస్సులో ప్రేమ వ్యవహారాలు, పెళ్లి కాకుండానే గర్భవతులు కావడం, లివింగ్‌ టుగెదర్‌ సంస్కృతి ఎక్కువకావడం వల్ల పుడుతున్న బిడ్డలను అనాథలుగా వదిలేస్తున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల లెక్కల ప్రకారం

జాతీయ ఆరోగ్య మిషన్‌ 2026–27 ఆశయాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాతృ, శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ద్వారా గర్భిణుల నమోదు, సురక్షిత ప్రసవాలు, టీనేజ్‌ గర్భాల గుర్తింపు ప్రక్రియపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తాజా నివేదికల ప్రకారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 15,945 మంది గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 12,279 మంది వైద్యాధికారుల పర్యవేక్షణలో సురక్షిత ప్రసవాలు చేసుకున్నారు. అత్యధికంగా ఓగు పీహెచ్‌సీలో 729 మంది గర్భిణులు నమోదు కాగా, 661 ప్రసవాలు, తుంబకుప్పం పరిధిలో 571 మంది నమోదు కాగా 504 ప్రసవాలు విజయవంతంగా జరిగాయి. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా 10,528 మంది గర్భిణులను పరిశీలించగా, అందులో 1,125 టీనేజ్‌ గర్భాలు కావడం గమనార్హం. ముఖ్యంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు పీహెచ్‌సీ పరిధిలో అత్యధికంగా 37, బుగ్గ ఆగ్రహారంలో 36, జీడీ నెల్లూరులో 35, బైరెడ్డిపల్లెలో 34 చొప్పున టీనేజ్‌ గర్భాలను అధికారులు గుర్తించారు.

వదిలేయొద్దు.. ఊయలలో వేయండి

కన్న బిడ్డలను పోషించలేక వద్దనుకునే తల్లిదండ్రుల కో సం జిల్లా మహి ళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పసికందుల ను చెత్తకుప్ప లు, ముళ్లపొదల్లో పడేసి ప్రాణాలు తీయకుండా ఉండేందుకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఊయలను అందుబాటులో ఉంచింది. బిడ్డలను ఆ ఊయలలో వేస్తే ప్రభుత్వం వారి బాధ్యతను స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అనధికారికంగా బిడ్డలను వదిలేసినట్లు గుర్తిస్తే వెంటనే 1098, 181, 112 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పేగు బంధం కరిగిపోయింది. తొమ్మిది నెలలు మోసిన అమ్మతనానికి కనికరం లేకుండా పోయింది. లోకంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటలు కూడా కాకముందే, ఏడుపు కూడా ఆగక ముందే చెత్తకుప్పలు, ముళ్లపొదలు, ఆస్పత్రి ఆవరణలు వారి నివాసాలుగా మారుతున్నాయి. అభం శుభం తెలియని ఆ లేత ప్రాణాలు చేసిన పాపమేమిటో ఎవరికీ తెలియదు. పేదరికమో.. సమాజానికి భయపడో.. లేక లింగ వివక్షో.. కారణమేదైనా పసిగుడ్డును నడి రోడ్డుపై వదిలేస్తున్న కర్కశత్వం మానవత్వానికి మాయని మచ్చగా మారుతోంది. అమ్మ ఒడిలో వెచ్చగా సేదతీరాల్సిన ఆ చిట్టి ప్రాణాలు చీకట్లో దిక్కుతోచక చేస్తున్న ఆక్రందనలు రాతి హృదయాలను సైతం కలచివేస్తున్నాయి.

పాపం పసి

పాపలు

చిత్తూరు ఆస్పత్రిలో వరుస ఘటనలు

మూడేళ్ల క్రితం ఒక తల్లి ఆడబిడ్డ పుట్టిందనే నెపంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అత్యవసర విభాగం బాత్‌రూంలో వదిలివెళ్లగా, ఆస్పత్రి సిబ్బంది నెల రోజుల పాటు మెరుగైన చికిత్స అందించి కాపాడారు. తాజాగా బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం వెనుక ఒక మగబిడ్డను వదిలివెళ్లారు. గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఆ బిడ్డను ఎస్‌ఎన్‌సీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బిడ్డను వదిలివెళ్లిన కఠినాత్ముల కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement