కొత్త దరఖాస్తుదారులకు అడుగడుగునా అడ్డంకులు డాక్యుమెంట్లు సరిపోలడంలేదంటూ తిరస్కరణ సచివాలయాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు గతంలో ఇళ్ల వద్దే కొత్త పింఛన్ల దరఖాస్తుల నమోదు జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు అవస్థలు
జీవచ్చవాల్లా బతుకులీడుస్తున్న నిస్సహాయులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ పింఛను కఠిన నిబంధనల ఉచ్చులో చిక్కుకుపోయింది. కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు సంక్షేమ ఫలాలు దక్కకపోగా, నిబంధనల పేరుతో అధికారులు పెడుతున్న కొర్రీలు వారి ఆశలను నిలువునా తుంచేస్తున్నాయి. సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన, అర్హత శాతం పెంపు, సాంకేతిక సమస్యల నెపంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఆసరాగా నిలవాల్సిన చేతులే అడ్డంకులు సృష్టిస్తుండడంతో కనీస జీవనాధారం కోసం నిస్సహాయులు కన్నీటి పర్యంతమవున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. కొత్త పింఛన్ల నమోదులో దివ్యాంగులు ఎదుర్కొంటున్న అవస్థలపై సాక్షి కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : శారీరక వైకల్యంతో బాధపడుతూ, పనులు చేయలేక ప్రభుత్వం ఇచ్చే ఆసరా కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నూతన పింఛన్ దరఖాస్తు ప్రక్రియ శాపంలా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పింఛన్ల నమోదుకు శ్రీకారం చుట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో విధిస్తున్న నిబంధనలు, సాంకేతిక సాకులు దివ్యాంగులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. అందజేస్తున్న డాక్యుమెంట్లు సరిపోలడంలేదంటూ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో వేలాది మంది దివ్యాంగుల ఆశలు అడియాసలవుతున్నాయి. దివ్యాంగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను వికలాంగుల ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అడుగడుగునా నిబంధనలు
కూటమి ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను పెంచకుండా, దరఖాస్తు దశలోనే అడ్డుకట్ట వేసేందుకే కఠిన నిబంధనలు తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపుల్లో తీవ్ర శ్రమకోర్చి తీసుకున్న వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ, పోర్టల్‌లో డేటా మ్యాచ్ కావడం లేదంటూ తిరస్కరించడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు. దరఖాస్తుల తిరస్కరణతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి తిప్పలు
జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు నియోజకవర్గాల్లో వేలాది మంది దివ్యాంగులు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అల్లాడిపోతున్నారు. సచివాలయ సిబ్బంది, ఆర్‌ఐలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం చెప్పేవారు కరువయ్యారు. శారీరక వైకల్యంతో పాటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ఇబ్బంది పెట్ట డం సబబు కాదని ఆవేదన చెందుతున్నారు. ప్రభు త్వం స్పందించి నిబంధనలను సడలించి, వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికీ సులభతరంగా పింఛన్ మంజూరు చేయాలని జిల్లాలోని దివ్యాంగ సంఘాలు ప్రతినిధులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా సమాచారం
దివ్యాంగుల పింఛనుపై కూటమి దెబ్బ!
మొత్తం పల్లెలు 5,228
రెవెన్యూ గ్రామాలు 822
పంచాయతీలు 697
కార్పొరేషన్, మున్సిపాలిటీలు 05
మొత్తం జనాభా 18.73 లక్షలు
ప్రస్తుతం అందుతున్న దివ్యాంగ పింఛన్లు 34,796
కొత్తగా అర్హత ఉన్న దివ్యాంగులు 5,145


