చిత్తూరు కార్పొరేషన్ : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను గురువారం సీఈఓ రవికుమార్‌నాయుడు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. మండలాల వారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్ల సంఖ్య, ముసాయిదా జాబితా ప్రచురణ, తుది జాబితా విడుదల తదితర అంశాల గురించి చర్చించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 1000 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1050 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలకు మినహాయింపు ఉన్నప్పటికీ 1200 మందికి పైగా ఓటర్లు ఉంటే తప్పనిసరిగా కేంద్రాన్ని విభజించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ప్రజలు అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో కేంద్రాలను ఏర్పాటు చేయరాదని తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు పోలింగ్ కేంద్రాలపై నివేదికను పూర్తి చేసి, తదుపరి ఓటర్ల జాబితాను ప్రచురించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. శుక్రవారం అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బంది పెట్టాలన్నారు.


