కుప్పంలో
‘పచ్చ’ గూండాలదే రాజ్యం
చిత్తూరు జెడ్పీ చైర్మన్‌పై దాడి చేసే క్రమంలో ధ్వంసమైన కారు
ఎమ్మెల్సీ భరత్‌పై దాడిచేసిన తర్వాత రోడ్డుపైనే కేకలు వేస్తున్న కుప్పంలోని టీడీపీ గూండాలు
సాక్షి, చిత్తూరు: 27 నెలల కూటమి పాలనలో కుప్పం నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 27 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నించిన పూడి శ్రీహరితోపాటు కొత్తపల్లెకు చెందిన ఈశ్వర్, అతని కుటుంబ సభ్యులు ఆరుగురిపై రెండుసార్లు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అసలైన కారణం మాత్రం 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా వ్యవహరించడమే. 2023లో అప్పటి రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ మాజీ సీఎం చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడారంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసు పెట్టారు. ఆపై ఆయన్ను అరెస్టు చేసి 15 రోజులు జైల్లో ఉంచారు. పచ్చ మూకల గూండాయిజానికి భయపడి బెయిల్‌పై వచ్చిన సెంథిల్‌కుమార్ గత 27 నెలలుగా ఊరు వదిలి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2024లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసినందుకు గాను కుప్పం మండలం మల్లానూరుకు చెందిన పార్టీ కార్యకర్తలు మురుగేష్, అతని కుమారుడు శీనుపై ట్రాక్టర్ చోరీ చేశారంటూ తప్పుడు కేసు పెట్టారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ రీచ్ నుంచి ఇసుక తెచ్చుకున్న పాపానికి శాంతిపురం మండలం నాయనపల్లెకు చెందిన కృష్ణమూర్తిపై ఇసుకను కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ కేసు పెట్టారు. ఇక సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రామాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఇద్దరు మహిళలపై అక్రమ కేసు పెట్టారు.
మీడియాపై కేసుల కత్తి
గత ఏడాది కుప్పంలో ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కొందరు దారి ఇవ్వలేదు. స్థానిక డీఎస్పీ కల్పించుకుని దారి కల్పించి, అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఇదే విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. సీఎం ఇలాఖాలోని పరిస్థితులు చూపించినందుకు సాక్షి రూరల్ రిపోర్టర్‌పై కేసు పెట్టారు. ఊర్లో చవితి జాతర నిర్వహణ గురించి మాట్లాడుతున్న సమయంలో తమపై దాడికి ప్రయత్నించారని కుప్పం సాక్షి రిపోర్టర్‌పై కేసు నమోదు చేశారు. దగా డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వ్యక్తి వివరాలు సేకరించడానికి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్, కెమెరామెన్‌ను కులం పేరిట దూషించిన నకిలీ ఉపాధ్యాయుడిని వదిలేసి సాక్షి టీవీ ప్రతినిధులపై క్రిమినల్ కేసు పెట్టారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై
ఎదురు కేసు
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రక్తం కళ్ల చూడడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దానికి కూడా తమ కార్యకర్తలు సిద్ధపడి, రక్తాభిషేకం చేయడానికై నా ముందుండాలని మాట్లాడినందుకు శాసన మండలి సభ్యు డు భరత్‌పై కేసు పెట్టారు. ఇదే భరత్‌ను చంపడానికి టీడీపీ మూకలు మారణాయుధాలతో ఇంటిపైకి వెళి తే మాత్రం కేసు లేదు. ఇక చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఓ సమావేశానికి హాజరై వస్తుండగా ఆయ న్ను చంపడానికి టీడీపీ మూకలు దాడులు చేశాయి. వాళ్ల నుంచి తప్పించుకుని ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని చిత్తూరుకు వచ్చి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెనువెంటనే కుప్పం టీడీపీ నాయకులు శాంతిపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జెడ్పీ శ్రీనివాసులు తమపై కారు ఎక్కించి చంపేందుకు ప్రయత్నించినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించమని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. కుప్పంలో వైఎస్సార్ సీపీ నేతలపై నమోదైన ప్రతి ఒక్క కేసులోనూ ఫిర్యాదుదారులు టీడీపీ కార్యకర్తలు, నేతలే. ఫిర్యాదులపై కనీస విచారణ చేయని పోలీసుశాఖ, పచ్చ మూకలు చేసిన చట్టాన్ని అమలుచేస్తూ బాబు పాలనకు సెల్యూట్ కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


