విజయపురం (నగరి) : మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై అనుచిత ప్రచారం చేసిన టీడీపీ సోషల్‌మీడియాపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశార. సోమవారం విజయపురం మండలం కోసలనగరంలో పోతురాజు కొలుపు మహోత్సవం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఆర్కేరోజా హాజరై స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయారు. అయితే అదే రోజు సాయంత్రం ఆలయం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు అధికారుల దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. అయితే కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రమాదాన్ని మాజీ మంత్రి పర్యటనకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరి మండలం అడవికొత్తూరుకు చెందిన మోహన్‌న్ కృష్ణ, ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు తమకు సమాచారం అందిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుని ఆలయంలో జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. మహిళా నాయకురాలిని అవమానించేలా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు. ఉత్సవాలకు మాజీ మంత్రి మాత్రమే రావడం, ఎమ్మెల్యే రాకపోవడంతో టీడీపీకి ప్రజల్లో ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని వారే అగ్రిప్రమాదాన్ని సృష్టించి ఉంటారనే అనుమానముందని వెల్లడించారు.
అడ్డుకట్ట వేయాలి
ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని, లేకుంటే భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే ప్రమాదముందని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. అసత్యాలతో కూడిన పోస్టర్‌ను ఎవరు రూపొందించారు? ఎవరి సూచనలతో తయారైంది? ఏయే సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై సాంకేతికంగా దర్యాప్తు చేయాలన్నారు. పోస్టర్ తయారీ, ప్రచారానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కోసలనగరం ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి అసలు కారణాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శివరాజు, జిల్లా నేతలు గుణశేఖర్ రెడ్డి, శేఖర్‌రాజు, నారపరాజు, నేతలు చెంచురాజు, సతీష్, హరి పాల్గొన్నారు.


