చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియలో 98 శాతం నోటీసుల విచారణ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ వివిధ దశల్లో నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మొత్తం 1,34,307 నోటీసులు జారీ చేశామని, వాటిలో 1,24,064 నోటీసులపై విచారణ పూర్తి చేసినట్లు వివరించారు. పత్రాల సమర్పణలో జాప్యం వల్ల ఆగిపోయిన మిగిలిన నోటీసులను త్వరలోనే కొలిక్కి తెస్తామన్నారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు సంబంధించి ఫారం 6లో 13,547, ఫారం8లో 7,979, అలాగే ఫారం7లో 481 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకుని నిర్దేశిత షెడ్యూల్ లోపు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బుక్ ఆఫ్ కాల్‌లోని 10 పెండింగ్ అంశాలు, ఎన్‌జీఎస్‌టీకి సంబంధించిన 5 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


