వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లపై కూటమి ప్రభుత్వం కత్తి..
ఎంఎల్‌హెచ్‌పీల డెప్యుటేషన్లతో బోసిపోయిన క్లినిక్‌లు
జిల్లాలో 410 కేంద్రాల్లో పలుచోట్ల మూసే పరిస్థితి
ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు
7 నుంచి ఫార్మసిస్టుల సమ్మె
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి ముంగిట ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సదాశయంతో ఏర్పాటైన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను (ఎంఎల్‌హెచ్‌పీ) క్లినిక్‌ల నుంచి తప్పించి పీహెచ్‌సీల పరిధిలోని ఈ–సంజీవని సేవలకు మళ్లిస్తోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పేదలకు అందుబాటులో ఉండాల్సిన హెల్త్ క్లినిక్‌లు వెలవెలబోతూ కీలకమైన ప్రాథమిక వైద్య సేవలు కుదేలవుతున్నాయి.
కాణిపాకం: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 410 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటిపై వివక్ష చూపుతోంది. హెల్త్ క్లినిక్‌ల నుంచి ఇప్పటికే 81 మంది ఎంఎల్‌హెచ్‌పీలను పీహెచ్‌సీల్లోని ఈ–సంజీవని సేవలకు అటాచ్ చేసి డెప్యుటేషన్‌పై పంపించింది. వీరికి తోడు మరో 25 మంది వరకు మహిళా ఉద్యోగులు ప్రసవ సెలవుల్లో ఉండగా, దాదాపు 38 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా పడి ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్ అసిస్టెంట్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి వెళ్తున్నారు. మిగిలిన ఎంఎల్‌హెచ్‌పీలను కూడా ఆయా పీహెచ్‌సీలకు డెప్యుటేషన్‌పై పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పల్లెల్లోని హెల్త్ క్లినిక్‌లను నడిపే దిక్కులేక మూతపడే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే సచివాలయ సిబ్బందిని డెప్యుటేషన్ల పేరిట ఇతర శాఖలకు పంపిన ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య రంగాన్ని కూడా గాలికి వదిలేస్తోందని పల్లె జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణానికి పరుగులు
కూటమి ప్రభుత్వం పల్లె వైద్యంపై కత్తి కట్టి పేదల ఆరోగ్య సేవలను దూరం చేస్తోంది. రెండేళ్లుగా మందులు, మాత్రలు పూర్తిగా కరువయ్యాయి. ఆపై సేవలను ఒక్కొక్కటిగా దూరం చేసింది. పరీక్షలు ఏ ఒక్కటి అక్కడ చేయడంలేదని పేద ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైద్య సేవల కోసం పేద ప్రజలు పట్టణం బాట పడుతున్నారు. లేకుంటే ఆర్‌ఎంపీలే దిక్కుగా మారుతున్నారు. ఇక పేదలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. వృద్ధులు నరకం అనుభవిస్తున్నారు. ఉచిత పల్లె వైద్యా న్ని విచ్ఛిన్నం చేస్తున్న కూటమి ప్రభు త్వం తీరుపై సర్వత్రా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా డెప్యుటేషన్లను రద్దు చేసి, హెల్త్ క్లినిక్‌లలో ఖాళీలను భర్తీ చేసి పల్లె వైద్యానికి ప్రాణం పోయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్య భాగ్యమే పరమావధిగా పనిచేసింది. విలేజ్ హెల్త్ క్లినిక్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు వెన్నెముకలా తీర్చిదిద్దింది. అక్కడ అర్హులైన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించడమే కాకుండా, విప్లవాత్మకమైన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వైద్యులు, వైద్య సిబ్బంది స్వయంగా గ్రామాలకే వచ్చి ఇంటింటికీ వెళ్లి చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో నిపుణులైన వైద్యులతో మాట్లాడించేందుకు టెలి కాన్ఫరెన్స్ సేవలను తెచ్చింది. అక్కడ 14 రకాల పరీక్షలు చేయడంతో పాటు 12 రకాల మెరుగైన సేవలను అందించింది. ఇంటి వద్దకే వైద్యం (పాలియేటివ్ కేర్), ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స పొందిన బాధితులు, క్యాన్సర్ రోగులు, మంచానికే పరిమితమైన పక్షవాత రోగులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం, మందులు అందించేలా చూసింది. ఇప్పుడు అవన్నీ కనుమరుగయ్యాయి.


