కలెక్టరేట్‌ సమీపంలోనే కబ్జా! | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ సమీపంలోనే కబ్జా!

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

ఒక హేచరీస్‌ అధినేత విగ్రహం ఏర్పాటుకు కుతంత్రాలు

చక్రం తిప్పుతున్న టీడీపీ నేత

పట్టించుకోని జిల్లా అధికారులు

దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి స్థలం హామీ హుళక్కేనా..?

కలెక్టర్‌, ఎస్పీ, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రోజూ తిరిగే కలెక్టరేట్‌ ప్రధాన రహదారి ముందే రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. చట్టం, యంత్రాంగం కళ్లెదుటే ఉన్నా సరే.. ఏమాత్రం అదురూ బెదురూ లేకుండా టీడీపీ నేత ప్రభుత్వ స్థలాన్ని తన సొంత ఆస్తిలా ఆక్రమించుకునేందుకు తెగబడ్డాడు. గురువారం సాయంత్రం జేసీబీతో చదును చేయించాడు. పట్టపగలే సాగుతున్న ఈ భూభాగోతం కలెక్టరేట్‌ పరిసరాల్లో తీవ్రకలకలం రేపుతోంది.

టీడీపీ నేత కబ్జాకు పాల్పడుతున్న ప్రభుత్వ భూమి

కలెక్టరేట్‌కు సమీపంలో జేసీబీతో ప్రభుత్వ భూమిని చదును చేస్తున్న దృశ్యం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలోని అత్యున్నత అధికారులు విధులు నిర్వహించే ప్రాంతంలోనే విలువైన సర్కారు స్థలాన్ని (45 సెంట్లు) స్థానిక టీడీపీ నాయకుడు కబ్జా కు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసిన సదరు నాయకుడు, కనీసం అధికారుల అనుమతి కూడా తీసుకోకుండా పట్టపగలే ప్రైవేట్‌ సర్వేయర్లను రంగంలోకి దించి సరిహద్దులు నిర్ణయించారు. ఆపై గురువారం మధ్యాహ్నం జేసీబీతో చదును చేయించారు. దివంగత వైఎస్సార్‌ విగ్రహం కోసం కేటాయించాల్సిన స్థలంలో, హేచరీస్‌ అధినేత విగ్రహం పెట్టేందుకు కుతంత్రాలు సాగిస్తున్నారు. హేచరిస్‌ నేత విగ్రహం పేరుతో భూమిని కబ్జా చేసి ఆపై చుట్టుపక్కల ఉన్న మరికొంత విలువైన సర్కారు భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే అసలు వ్యూహమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చట్టం అందరికీ ఒక్కటి కాదా?

కలెక్టరేట్‌ సర్కిల్‌కు కూతవేటు దూరంలో పట్టపగలే కబ్జా పర్వం సాగుతున్నా రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని దుస్థితి. దీని వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్యులు చిన్న ఇల్లు నిర్మించుకుంటే నోటీసులు ఇచ్చి కూల్చివేసే అధికారులు, అధికార పార్టీ నేత ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో చెప్పాలని స్థానికులు నిలదీస్తున్నారు. కలెక్టర్‌ తక్షణం స్పందించి, ఆక్రమణ యత్నాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో ఇచ్చిన హామీ నిరర్థకమేనా?

కలెక్టరేట్‌ సర్కిల్‌ ఆధునీకరణ, ప్లై ఓవర్‌ ఏర్పాటు, విస్తరణ పనుల్లో భాగంగా గతంలో అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఆ సమయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ సమీపంలోని ఖాళీ ప్రభుత్వ స్థలంలోనే వైఎస్సార్‌ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామ ని అప్పటి కలెక్టర్‌, పాలకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని టీడీపీ నేత కబ్జాకు పాల్పడుతుండడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement