చిత్తూరు కార్పొరేషన్ : అసెంబ్లీలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని వాణిజ్యపన్నులశాఖ జేసీ, డీసీ కార్యాలయాలు తిరుపతికు మార్చడం అపాలని ఇటీవల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టామన్నారు. ఈ ఆందోళనను ఉద్దేశించి అసెంబ్లీలో గురజాల మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీఓ ఇచ్చారని, ఇప్పుడు వాళ్లు నిరసన తెలుపుతున్నారని మాట్లడడం సరికాదన్నారు. గతంలో ఎన్నికల ముందు జీఓ ఇచ్చారని, తాము స్పందించి రాష్ట్ర నేతల దృష్టికి తీసుకెళ్లడంతోనే కార్యాలయాల తరలింపును ఆపారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పలు జీఓలను రద్దు చేసిందని, అలాగే కార్యాలయ తరలింపు జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో గొడవపడి అయినా కార్యాలయ తరలింపును అపుతా అని ఎమ్మెల్యే ఆర్భాటంగా ప్రకటించారన్నారు. ఇప్పుడు మాత్రం నాలుక మడతపెట్టి తప్పుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే ప్రతిమాటకు అభివృద్ధి అని ఊతపదం పట్టుకోవడం సరికాదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, హెల్త్‌సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే చిత్తూరు కేంద్రంగా కేంద్ర సహకారంతో రూ.10,351 కోట్లతో మంజూరు అయిన చిత్తూరు–తచ్చూరు రోడ్డు, బెంగళూరు–చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు పనులు చేపట్టామని వెల్లడించారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గంలో రూ.169 కోట్లతో మూడు ఆర్‌ఓబీలు నిర్మించామన్నారు. చంద్రబాబు పాలనలో మూసివేసిన విజయా డెయిరీని జగనన్న పాలనలో అమూల్ డెయిరీకు అప్పగించి పునఃప్రారంభించారని తెలిపారు.
గుడిపాలలో సీఎంసీ ఆస్పత్రి అభివృద్ధికి సహకారం అందించామన్నారు అభివృద్ధి అంటే అది అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపాలిటీ నిధులతో నాసిరకం రోడ్లు వేసి గొప్పలు చెప్పుకుంటున్నరని ఆరోపించారు. వర్షాలు నిరవధికంగా పడితే ఆ రోడ్లు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. స్థానిక కోర్టు దగ్గర నుంచి సంతపేట కూడలి వరకు వేసిన రోడ్డు నాణ్యంగా లేదని, అక్కడ కాలువలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నగరపాలక పరిధిలో కాంట్రాక్ట్ పనులు చేయాలంటే ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సి వస్తోందని విమర్శించారు. చిత్తూరులో కాంట్రాక్టర్లు లేన్నట్లు తిరుపతి నుంచి ఈశ్వర్ అనే కాంట్రాక్టర్‌ను రప్పించి రూ.కోట్ల పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. అతడి నుంచి 15 – 20 శాతం కప్పం తీసుకుంటున్నారని ఆరోపించారు. చవటపల్లె– సంతపేట రోడ్డును అంచనా వ్యయం పెంచి ఆయనకే అప్పగించారన్నారు. ప్రజాధనం వృధా చేస్తూ అభివృద్ధి ముసుగు వేస్తున్నారని విమర్శించారు.


