పలమనేరు : నమ్మినోళ్లే గొంతుకోసిన చందాన తయారైంది పలమనేరులోని కొన్ని ప్రైవేటు బ్యాంకుల పరిస్థితి. గతంలో పట్టణంలోని కనకదుర్గ గోల్డ్‌లోన్స్ బ్యాంకులో సిబ్బంది చేతివాటం చూపి రూ.కోట్లలో మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే ఇదే పలమనేరులో పేరున్న బ్యాంకులో ఇదే తరహాలో రూ.కోట్లు దిగమించిన విషయం శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు.. పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న ఓ బ్యాంకులో అప్రైజర్‌తో కలిసి కొందరు సిబ్బంది రెండేళ్లుగా అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. అవసరమున్న వారు బ్యాంకులో తమ బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన బంగారాన్ని అప్రైజర్ చెక్‌చేసి అది ఒరిజినల్ అయితేనే రుణం మంజూరు చేస్తారు. అయితే అదే ఒరిజినల్ బంగారు స్థానంలో నకిలీ బంగారం పెట్టి కొన్నాళ్లుగా అక్కడి సిబ్బంది రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. ఈ తంతు గత రెండేళ్లుగా సాగుతోంది. దీనిపై అనుమానంతో బ్యాంకు ఉన్నతాధికారుల ఇటీవల చేపట్టిన విచారణలో మోసాలు బయటపడినట్టు తెలిసింది. దీంతో సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులు శుక్రవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో మొత్తం ఎన్ని రూ.కోట్ల వరకు అక్రమాలు జరిగాయి, ఎవరెవరు పాత్రధారులు, అసలు సూత్రధారులెవరు, అసలైన బంగారాన్ని ఎక్కడ పెట్టారు, వీరికి ఎవరు డబ్బులిచ్చారు, ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు లావాదేవీలు ఎంత జరిగాయనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తం మీద బ్యాంకులో బంగారం పెట్టి రుణాలు పొందాలంటేనే భయపడే విధంగా సాగుతున్న ఈ అక్రమాలు జనంలో బ్యాంకులపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విషయమై సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరగా బ్యాంకులో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనన్నారు. కేసును విచారిస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


