బస్సులో టీచర్‌ సెల్‌ఫోన్‌, నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

బస్సులో టీచర్‌ సెల్‌ఫోన్‌, నగదు చోరీ

Aug 22 2026 12:41 AM | Updated on Aug 22 2026 12:41 AM

● ఆంధ్రాకు చెందిన మహిళలు ఇద్దరి అరెస్టు ● ఇద్దరికి గాయాలు

● ఆంధ్రాకు చెందిన మహిళలు ఇద్దరి అరెస్టు

తిరుత్తణి: బస్సులో ప్రయాణిస్తున్న టీచర్‌ వద్ద సెల్‌ఫోన్‌, నగదు చోరీ చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగకు చెందిన జానకి(36) ఆవడిలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె గురువారం సాయంత్రం పాఠశాల నుంచి తిరుత్తణి చేరుకుని కమలా థియేటర్‌ బస్టాపు నుంచి 27 టౌన్‌ బస్సులో కేజీ.కండ్రిగకు ప్రయాణించారు. కేజీ.కండ్రిగ వద్ద దిగే సమయంలో ఆమె వద్ద వున్న హ్యాండ్‌ బ్యాగులో వుంచిన సెల్‌ ఫోన్‌, రూ.10 వేలు చోరీకి గురైంది. పక్కనే వున్న మహిళ వేగంగా బస్సు దిగి మరో బస్సు ఎక్కే ప్రయత్నేం చేయగా అనుమానంతో టీచర్‌ కేకలు విన్న ప్రయాణికులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. ఆమె వద్ద సెల్‌పొన్‌, నగదు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ మహిళలు ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురానికి చెందిన కృష్ణమ్మ(15), పద్మ(26)గా గుర్తించారు. బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి గాయాలు

పూతలపట్టు(యాదమరి): చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. పూతలపట్టు మండలం ఆకనంబట్టు దళితవాడకు చెందిన శ్రీకాంత్‌ ద్విచక్రవాహనంలో వెళుతుండగా పాల ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీకాంత్‌ను 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం చీలాపల్లి సీఎంసీకి తీసుకెళ్లారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాల ఢీ

బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయరహదారిలోని దేవదొడ్డి సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌కు చెందిన సాయి (34) బైరెడ్డిపల్లె వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా మరో బైక్‌పై వస్తున్న బీహార్‌కు చెందిన వ్యక్తి ఢీ కొన్నాడు. క్షతగాత్రులను108లో బైరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుప్పంరూరల్‌ : మల్లానూరు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. సుమారు 40 ఏళ్ల వ్యక్తి మల్లానూరు సమీపంలోని రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గుర్తించి కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మరణించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

డీజిల్‌ దొంగల ముఠా అరెస్ట్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరం మురుకంబట్టు పరిసర ప్రాంతాల్లో తాలూకా పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడింది. నిందితులకు చెందిన ఐషర్‌ వాహనంలో 8 క్యాన్ల డీజిల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన లారీలు, ఇతర వాహనాల నుంచి డీజిల్‌ను చోరీ చేసి రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ ఆలీ హుస్సేన్‌ అలియాస్‌ ఆలీ (43), డ్రైవర్‌ అమ్జద్‌ ఖాన్‌ (39), కూలీగా పనిచేస్తున్న సలీమ్‌ ఖాన్‌ (47)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

అదృశ్యమైన వ్యక్తి అప్పగింత

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మతిస్థిమితం లేక కనిపించకుండా పోయిన వ్యక్తిని బీఎన్‌ఆర్‌పేట పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. వివరాలు.. కర్ణాటకలోని గుడిబండకు చెందిన రాజేష్‌ (31) ఈ నెల 6వ తేదీన కనిపించకుండా పోవడంతో అక్కడ కేసు నమోదైంది. చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట పరిధిలో సంచరిస్తున్న రాజేష్‌ను పోలీసులు గుర్తించారు. రాజేష్‌ సోదరుడిని పిలిపించి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement