‘ఉపాధి’కి ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ఆంక్షలు

Aug 22 2026 12:41 AM | Updated on Aug 22 2026 12:41 AM

● వీబీజీరామ్‌జీలో పరిమితి విధింపు

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్రం నూతనంగా అమలు చేసిన వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజివిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ జీరామ్‌జీ) పథకంలో పొందే ఉపాధి లబ్ధిపై ఆంక్షలు విధించారు. గతంలో ఈ పథకం పరిధిలో ఎన్ని స్కీమ్‌లు ఉన్నా అన్నిటినీ వినియోగించుకునే అవకాశం లబ్ధిదారులకు ఉండేది. అయితే, నూతన చట్టంలో ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.4 లక్షలు పరిమితి విధించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉన్నప్పుడు కూలీలకు వేతనాలు లభించే పనుల కల్పనతో పాటు మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, వ్యక్తిగత ప్రయోజనం ప్రత్యేకించి గ్రామీణ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఉపకరించేవిగా ఉండేవి. సామాజిక అంశాలలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో సిమెంట్‌ రోడ్డు, డ్రెయిన్లు, పాఠశాలలు, శ్మశానాలు, పలు భవన నిర్మాణాలను భారీగా చేపట్టేవారు. అలాగే గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు, జల సంరక్షణలో విస్తారంగా పండ్ల తోటల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, పొలాల్లో నీటి కుంటలు, ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు తవ్వకాలు, పేదల పక్కా గృహాల నిర్మాణం వంటి అనేక స్కీమ్‌లకు ఈ నిధులు మంజూరు చేసేవారు. పండ్ల తోటల పథకంలో గరిష్టంగా ఐదు ఎకరాల పరిమితి ఉండగా మూడేళ్ల వ్యవధిలో ఎకరాకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరేది. పంట కుంటలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు సగటున అందేవి. అలా ఒక రైతు తన భూమిలో ఎన్ని అయినా తవ్వుకునే అవకాశం ఉండేది. పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల మంజూరు చేసేవారు.

క్షేత్రస్థాయిలో ఆందోళన

గతంలో ఒక కుటుంబానికి పండ్ల తోటల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, పంట కుంటలు, ఇంకుడుగుంతల తవ్వకాలు, ఇతరత్రా ఎన్ని స్కీమ్‌లైనా మంజూరు చేసేవారు. వాటి ద్వారా వచ్చే ఆర్థిక లబ్ధిపై పరిమితి ఉండేది కాదు. కూలీలకు కల్పించే పనులకు వీరు కూడా వెళ్లవచ్చు. అయితే తాజా చట్టం ప్రకారం ఒక కుటుంబానికి అన్ని స్కీమ్‌లు కలిపి రూ.4 లక్షలు మించి లబ్ధి అందే అవకాశాలు లేవు. ఈ మేరకు పరిమితి విధించారు. అంటే నాలుగు ఎకరాల పండ్లతోటల స్కీమ్‌ మంజూరు చేస్తే సదురు రైతుకు ఇక పంట కుంటలు, పశువుల షెడ్‌ ఇతరత్రా మంజూరు చేసే అవకాశం లేదు. ఈ విధానంపై సిబ్బందిలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. కూలీలకు పనుల కల్పనతో ఇచ్చే వేతనాలను రూ.4 లక్షల పరిమితికి లింక్‌ పెట్టకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement