కర్ణాటకలో పెరుగుతున్న బాధితులు మహమ్మారి బారిన అధిక సంఖ్యలో యువత అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ
కర్ణాటకలో ప్రాణాంతక హెచ్‌ఐవీ కోరలు చాచుతోంది. ఈ వైరస్ బారిన పెద్దసంఖ్యలో యువత పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. అనుమానిత కేసులను
గుర్తించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్రచారంతోపాటు ఎక్కడికక్కడ
యువతకు వైద్యపరీక్షలు చేయిస్తోంది. రక్షణ లేని లైంగిక సంబంధం ప్రమాదకరమంటూ అవగాహన కల్పిస్తోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వేలల్లో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. కర్ణాటకలో రేగిన ఈ హెచ్‌ఐవీ అలజడితో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుఅప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్ర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మన జిల్లా ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలను వేగవంతం చేసింది. యువతలో వ్యాధిపై చైతన్యం పెంచడంతో పాటు అనుమానిత కేసులను తక్షణమే గుర్తించి పరీక్షలు, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
క్షేత్రస్థాయిలో అవగాహన
ఈ నెల 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ప్రత్యేక అవగాహన ఉద్యమం, అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. యంగ్ ఏజ్ గ్రూప్‌లోని పిల్లలే అవగాహన లోపంతో తప్పుడు మార్గాల్లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో కళాశాలలు, హాస్టళ్లలో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. రక్షణ లేని లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు వాడడం, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం వంటి కారణాలపై అవగాహన కల్పిస్తున్నారు. పైకి ఆరోగ్యంగా కనిపించినా లోపల హెచ్‌ఐవీ ఉండవచ్చని, కాబట్టి ఉద్రేకానికి లోనుకాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
లక్ష్యం మేరకు
మరోవైపు, ప్రజలు తమ రిస్క్ స్థాయిని గోప్యంగా తెలుసుకునేందుకు ఒక క్యూఆర్ కోడ్‌ను, సమీపంలోని ఉచిత పరీక్ష కేంద్రాలు, ఉచిత చికిత్సా కేంద్రాలు తెలుసుకునేందుకు మరొక క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో ప్రస్తుతం దాదాపు 6వేల మందికి సేవలు అందుతుండగా, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా జిల్లా టార్గెట్‌లో 95 శాతం అచీవ్‌మెంట్‌ను సాధించేందుకు వేగంగా టెస్టింగ్‌లను పెంచుతున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులకు కావాల్సిన హెచ్‌ఐవీ నిర్ధారణ కిట్లు, ఐఈసీ ప్రచార సామగ్రిని కొరత లేకుండా సరఫరా చేశారు. చిత్తూరు, కుప్పంలో ఉన్న ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా బాధితులకు ఉచితంగా జీవితాంతం మందులు అందజేస్తామని, అనుమానం ఉన్నవారు సంకోచించకుండా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు కోరుతున్నారు.


