మహిళల్ని అవమానిస్తావా బాబూ? | - | Sakshi
Sakshi News home page

మహిళల్ని అవమానిస్తావా బాబూ?

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

మహిళలు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారంటూ అవమానం భోజనానికి ఇంటికి పిలిచి మహిళల్ని అవమానిస్తారా? ఓటుకు నోటు నేర్పించిన డర్టీ పొలిటీషియన్‌ చంద్రబాబు మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజం

నగరి: మహిళలు ఎవరు ఏమి ఇచ్చినా వెంపర్లాడే వారిలా, డబ్బుకు ఆశ పడేవారిలా చిత్రీకరిస్తూ, అమ్మా.. మీరు ఓటుకు రూ.2 వేలు తీసుకున్నారు!.. ఇచ్చిన వాడు లక్షలు సంపాదించుకోవాలనుకుంటాడు అని మహిళలను అవమానించిన సీఎం చంద్రబాబు తక్షణం వారికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరిలోని తన నివాసంలో ఆమె మీడియా తో మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి డబ్బులిచ్చి ఓట్లు కొన్నామని మహిళలతోనే చెప్పడం సిగ్గు చేటన్నారు. ఎన్టీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలనే డబ్బుతో కొని, ఎన్టీఆర్‌పైనే చెప్పులు వేయించిన ఘటనను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి నోటుకు ఓటు వీడియోతో అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్‌ అన్న కేసీఆర్‌ మాట నేడు అక్షర సత్యమన్నారు. డబ్బుతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ఎవరికై నా ఎప్పుడైన వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎన్నికల సమయంలో జగనన్న ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానంటూ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పచ్చ మీడియాకు అదే డబ్బు ఇచ్చి హామీలను నెరవేర్చినట్లు చూపించుకుంటున్నారని ఆరోపించారు.

లక్ష కోట్లకు

అధిపతి ఎలా అయ్యారు?

రెండెకరాల చంద్రబాబు ఈరోజు లక్ష కోట్లకు అధిపతి ఎలా అయ్యారని రోజా ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌ పిల్లికి భిక్షం పెట్టని వ్యక్తి, తన హక్కులా ఇక్కడి సహజ వనరులైన గ్రావెల్‌, ఇసుక, గ్రానేట్‌ను అక్రమంగా తరలిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. పీఆర్‌పీని ఎలా భూస్థాపితం చేసారో, జనసేనను ప్యాకేజీతో మేనేజ్‌ చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వీధికొక బెల్ట్‌ షాపు పెట్టడం ద్వారా మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. కుప్పంలో గంజాయి సాగు, హోంమంత్రి నివాస సమీపంలో గంజాయి సాగు నిజం కాదా అని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు రూ.2.4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 31 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఇక్కడ దోచుకొన్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేవారని, ఓటుకు డబ్బు తీసుకున్నారంటూ అవమానించిన చంద్రబాబు మహిళలకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అవినీతి, ఆరాచకలాను గమనిస్తున్న ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement