అమాంతం పెరిగిపోయిన బియ్యం ధరలు
జిల్లాలో బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. అంతర్జాతీయ యుద్ధాలు, ఎల్‌నినో కారణాలను సాకుగా చూపి బస్తాపై రూ.500 వరకు అధనంగా గుంజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనలేక కుమిలిపోతున్నారు. ధరలు నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుండగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా తమకెందుకులే అన్నట్టు మిన్నకుండిపోతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా దోచేస్తూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటికి గండం వచ్చిపడింది. భోజన పళ్లెంపై ధరల పిడుగు పడింది. గడిచిన మూడు నెలలుగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండగా.. వ్యాపారులు ఇదే అదునుగా దోపిడీకి తెరదీస్తున్నారు.
సిండికేట్?
ఇతర జిల్లాలకు చెందిన వ్యాపార సిండికేట్ ఈ బియ్యం దందాను నడిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌లోకి సరఫరాను కావాల నే తగ్గిస్తూ, ధరలను అమాంతం పెంచుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఇక ఎగుమతుల పేరుతో ఇక్క డ కొరత సృష్టిస్తూ..బియ్యం ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. మరోవైపు వరిధాన్యం పండించొద్దని కూటమి ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది. ఇటీవల ఒక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసలు బియ్యం తినేవారే లేరన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ వైపు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, మరోవైపు వ్యాపారుల అక్రమ నిల్వలతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది.
నిఘా వ్యవస్థ ఏదీ?
బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నా రెవెన్యూ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖలు తనిఖీల పేరిట కనీసం క్షేత్ర స్థాయికి రాకపోవడం వెనుక పెద్ద గూడు పుఠాణీ ఉందనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వ్యాపారులకు వరంగా మారింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి బియ్యం సిండికేట్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, రీటైల్ ధరలను అదుపులోకి తీసుకురావాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పాత బియ్యం మాయం
జిల్లాలో 4వేల మందికి పైగా బియ్యం వ్యాపారులున్నారు. దీంతో పాటు పల్లెల్లో వ్యాపారాలు చేసుకునే వారు కూడా వేలల్లో ఉన్నారు. సాధారణంగా ప్రజలు అన్నం వండుకోవడానికి పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే, మార్కెట్లో పాత బియ్యం దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు, ఆ సాకుతో కొత్త బియ్యం ధరలను కూడా అమాంతం పెంచేశారు. ధరల మంట నుంచి ఉపశమనం పొందేందుకు రైతు బజార్ వైపు వెళ్లిన ప్రజలకు అక్కడ కూడా తీవ్ర నిరాశే ఎదురవుతోంది. బహిరంగ మార్కెట్‌లోని ధరలకు, రైతు బజార్ లోని ధరలకు పెద్ద తేడా లేకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.


