చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17 వ తేదీ నుంచి ఫార్మెటివ్–1 (ఎఫ్‌ఏ–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలి పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఏ–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన బుక్‌లెట్‌లు మండల కేంద్రాలకు వచ్చినట్లు చెప్పారు. వాటిని త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతామన్నారు. ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రతి పాఠ్యాంశానికి ఒకటి చొప్పున అసెస్‌మెంట్ బుక్‌లెట్ ఇస్తారన్నారు. ఏడాదిలో వివిధ దశల్లో ఎఫ్‌ఏ 1, 2, 3, 4 పరీక్షలను నిర్వహించడం జరు గుతుందన్నారు. పరీక్షల ప్రశ్నలకు సమాధానాలన్నీ బుక్‌లెట్‌లోనే రాయా ల్సి ఉంటుందన్నారు. 6 నుంచి 10 వ తరగతి ప్రశ్నాపత్రాలు ఎంఈవో కార్యాలయం నుంచి, 1 నుంచి 5 వ తరగతి ప్రశ్నాపత్రాలు ఆయా కాంప్లెక్స్ స్కూల్స్ నుంచి అందిస్తారని తెలిపారు. ఏ రోజు పేపర్లు ఆ రోజే అందజేయడం జరుగుతుందని డీఈవో వెల్లడించారు.


