ఆశాలకు
ఆశావర్కర్లకు వైద్య సిబ్బంది వేధింపులు
కూటమి నేతల వేధింపులు కూడా
ఫిబ్రవరిలో డిమాండ్ల సాధన కోసం
నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లు
కాణిపాకం: గ్రామీణ ప్రాంతాల్లో నిమిషం విరామం లేకుండా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తూ, ఆరోగ్య వ్యవస్థకే వెన్నుముకలా నిలుస్తున్న ఆశా కార్యకర్తల జీవితాలు అభద్రతా నిలయాలుగా మారుతున్నా యి. ఓ వైపు మోయలేని పనిభారం, మరోవైపు క్షేత్రస్థాయి అధికారుల మానసిక వేధింపులతో జిల్లాలో ఆశా కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో కుమిలిపోతు న్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పెత్తందారీ అధికారుల వేధింపులు తాళలేక కడకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘోరా లు చూడాల్సి వస్తోంది.
పెచ్చుమీరిన పెత్తనం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆశా కార్యకర్తల విధులు ప్రధానంగా అవగాహన కల్పించడం, గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణ, ఇమ్యునైజేషన్, టీబీ–మలేరియా వంటి జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికే పరిమితం. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏఎన్‌ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది వీరిపై తీవ్రమైన పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పరిధిలోని పనులను కూడా ఆశా వర్కర్తలో బలవంతంగా చేయిస్తూ, చేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నిత్యం బెదిరింపులకు దిగుతున్నట్లు ఆశా వర్కర్ల సంఘాలు తీవ్రస్థాయిలో వాపోతున్నాయి. మాతృత్వ – శిశు సంరక్షణలో భాగంగా చెకప్‌లు, హోమ్ విజిట్లు (42 రోజుల్లో 6 నుండి 7 సార్లు). ఆన్‌లైన్ యాప్‌లు, 30 ఏళ్లు దాటిన వారికి స్క్రీనింగ్ ఫారాలు నింపడం, రోజూ ఆన్‌లైన్ డేటా ఎంట్రీలు చేయడం, జాతీయ కార్యక్రమాల నిర్వహణ, మలేరియా స్లైడ్ల సేకరణ, టీబీ రోగులకు సేవలు, సబ్ సెంటర్‌లో జనన మరణాల వివరాల నవీకరణ వంటి పలు రకాల బాధ్యతలు నెత్తినేసుకుని, సొంత ఖర్చులతో తిరుగుతున్నా కనీస గుర్తింపు లేకపోగా, పైఅధికారుల వేధింపులే సమాధానమవుతున్నాయి.
తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం, శెట్టిగుంట పీహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్న ఒక ఆశా వర్కర్‌కు, ఇటీవల కూటమి నేతకు మధ్య గొడవ జరిగింది. ఈ కారణంగా స్థానిక ప్రజాప్రతినిధి, ఆ ఆశా వర్కర్‌ను నియోజకవర్గంలో లేకుండా చేయాలని సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ఆ ఆశా వర్కర్ పనితీరు ‘భేష్’ అని నివేదిక ఇచ్చారు. అయినా సరే, ఆ ప్రజాప్రతినిధి తన ఒత్తిడిని వీడకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారు.
ఓవైపు అధికారుల నరకం చాలదన్నట్లు, మరోవైపు స్థానిక కూటమి నేతల పెత్తనం కూడా తీవ్ర స్థాయికి చేరింది. వాళ్లను తొలగించాలని, వీళ్లను విధుల నుంచి తీసేయాలని అధికారులపై విపరీతమైన ఒత్తిడి తెస్తు న్నారు. ఈ రాజకీయ బెదిరింపులు కూడా ఆశా వర్క ర్లను మానసికంగా కోలుకోలేని విధంగా కుంగదీస్తున్నా యి. వీటి దృష్ట్యా ఇటీవల చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆశా కార్యకర్తలతో ప్రత్యేక జాయింట్ కమిటీ గ్రీవెన్స్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ స్వయంగా ఆశా వర్కర్ల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెంచవద్దని గతనెల 27వతేదీ ఉత్వర్వులు జారీ చేశారు. అయినా పెత్తనం, వేధింపులు కొనసాగుతూనే ఉన్నా యని పలువురు ఆశావర్కర్లు వాపోతున్నారు.


