చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో చేపడుతున్న సర్ ప్రక్రియ నోటీసుల జారీ ఈనెల 31 వ తేదీలోపు పూర్తి కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియపై చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్‌యాదవ్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్‌లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వివరాలు వెల్లడించారు. మ్యాపింగ్ కాని ఓటర్లకు, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. సర్ ప్రక్రియలో దాఖలైన క్లెయిమ్స్, అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో బీఎల్వోలు, రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఫారాల సమర్పణలో సహాయపడతారన్నారు. జిల్లా లో 18–19 ఏళ్ల యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


