చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి జరుగుతున్న ఆర్‌డీఎస్‌ఎస్ పనులు డిసెంబర్ లోపు పూర్తిచేయాలని ట్రాన్స్‌కో ప్రాజెక్ట్స్ సీజీఎం రమణదేవి ఆదేశించారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో ఆర్‌డీఎస్‌ఎస్ పనులపై ఆమె అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 421 ఫీడర్లు ఉండగా అందులో ఇప్పటివరకు 300 ఫీడర్లలో పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 121 ఫీడర్ల పనులను నెలకు 30 ఫీడర్ల చొప్పున చేసి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పాడైన, పాతబడిన కరెంటు స్తంభాలను మార్పు చేయాలన్నారు. పల్లెల్లో విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజీ సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాత విద్యుత్ స్తంభాలు 8 మీటర్ల స్థానంలో కొత్తవి 9, 11 మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగంగా చేయాలని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అమర్‌బాబు, ఈఈలు మునిచంద్ర, భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


