చదరంగం జీవితానికి ప్రతిబింబం
నగరి: చదరంగం క్రీడ మాత్రమే కాదని, అది మనిషి జీవితాన్ని ప్రతిబింబించే మేధో క్రీడ అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో ప్రభాకర్‌రాజు తెలిపారు. నగరి మండలంలోని వీకేఆర్‌పురం గ్రాండ్ వరల్డ్‌లో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నగరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల చెస్ పోటీల ఫైనల్స్, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో టి.హేమాద్రి, (నగరి), డి.శ్యామ్‌కుమార్ (శ్రీకాళహస్తి), ఎన్.సహస్ర (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జూనియర్స్ విభా గంలో టీ.చైతన్య (నగరి), సాయిచరణ్ (తిరుపతి), ఆషిక్ ఇల్లాహి (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. అండర్ 9 విభాగంలో పి.పవన్‌కిరీటిరెడ్డి (తిరుపతి), తేజ సూర్యనారాయణ (నగరి), పీవీఎం.సాత్విక్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. సీనియర్స్ విభాగంలో ముగ్గురికి, జూనియర్స్ విభాగంలో 22 మందికి, అండర్–9 విభాగంలో 10 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న మహిళలు, దివ్యాంగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభాకర్‌రాజు మాట్లాడుతూ చదరంగంలో ప్రత్యర్థి వేసే ఎత్తును ముందుగానే ఊహించి తదుపరి అడు గు వేయాలన్నారు. మరో అతిథిగా పాల్గొన్న పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ చదరంగం చిన్నారుల్లో చదువుపై ఏకాగ్రతను పెంచడంతో పాటు, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రతి ఎత్తు ఒక పాఠాన్ని నేర్పుతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గజేంద్ర, డైరెక్టర్లు రవిబాబు, ఆర్‌ఎన్ దేవన్, చదరంగ నిపుణులు నవీన్‌కుమార్, జీవన్, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్ క్లబ్ కార్యదర్శి కిషోర్‌కుమార్, కోశాధికారి శక్తివేలు పాల్గొన్నారు.


