గుడిపాల: ఆదివాసీలు దేశానికి మూలవాసులని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుడిపాల మండలంలోని కనకనేరి ఎస్టీ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ అటవీ హక్కు చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, విద్యాహక్కు, మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన చట్టాలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, న్యాయసేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విస్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండక ముందు వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు రూపొందించిన పోక్సో చట్టం గురించి వివరిస్తూ, పిల్లల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని వాటికి దూరంగా ఉండేలా పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సిద్ధార్ధ్, ఏవో వేణు, డెప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, ఎస్‌ఐ రామ్మోహన్, న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


