లక్ష్మణస్వామి వర్మ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణస్వామి వర్మ సేవలు చిరస్మరణీయం

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : సమాజ శ్రేయస్సుకు, ఆయుర్వేద రంగానికి లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని డీఆర్వో మోహన్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సామాజికవర్గం పురోగతికి, పేదల అభ్యున్నతికి లక్ష్మణస్వామి వర్మ విశేష కృషిచేశారని కొనియాడారు. ఆయన అగ్నికుల వీర సంప్రదాయానికి నిజమైన వారసుడని చెప్పారు. గొప్ప సమాజ సంస్కర్త అని ప్రశంసించారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి, ఆ సామాజిక వర్గాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన పోరాట ఫలితంగానే 1927లో జీవో 271 తో అగ్నికుల క్షత్రియులుగా ప్రభుత్వ అధికారిక గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. కేవలం సామాజిక సేవకే పరిమితం కాకుండా, ఆయుర్వేద వైద్య రంగంలోనూ ఆయన అపార సేవలు అందించారని తెలిపారు. దాదాపు 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశవిదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, ఉదయ్‌, ప్రదీప్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement